Begin typing your search above and press return to search.

అన్ని లక్షల మంది గ్రామ సచివాలయ ఉద్యోగాల కోసం పరీక్షలు రాశారు

By:  Tupaki Desk   |   21 Sept 2020 10:00 AM IST
అన్ని లక్షల మంది గ్రామ సచివాలయ ఉద్యోగాల కోసం పరీక్షలు రాశారు
X
ఓపక్క కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్న వేళలో.. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలు ఏపీలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో భాగంగా కరోనా పాజిటివ్ అయిన వారి కోసం ప్రత్యేక పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేసింది ఏపీ సర్కారు. దీనికి తగ్గట్లే.. ఈ పరీక్షల కోసం ఆదివారం ఉదయం.. మధ్యాహ్నం రెండు దఫాలుగా సాగిన పరీక్షల్లో లక్షలాది మంది రాయటం గమనార్హం.

తొలిరోజు రాష్ట్ర వ్యాప్తంగా 5.06లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాసినట్లుగా తేల్చారు. ఉదయం వేళలో 4.56 లక్షల మంది పరీక్షలు రాయాల్సి ఉండగా.. 3.4లక్షల మంది పరీక్షలు రాశారు. మధ్యాహ్నం వేళలో 2.24 లక్షల మందికి గాను 1.65 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. అంటే.. సరాసరిన 73 శాతానికి పైనే పరీక్షలు రాశారు. ఇదిలా ఉంటే.. కోవిడ్ కేసులు ఏపీలో ఎక్కువగా నమోదవుతున్న వేళ.. పాజిటివ్ అయిన వారు పరీక్ష రాసే అవకాశం కోల్పోకుండా ఉండేందుకు ప్రత్యేక పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉంటే.. ఈ రోజు ఉదయం వీఆర్వో పరీక్షలు మధ్యాహ్నం ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులకు పరీక్షల్ని నిర్వహించనున్నారు. ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో అత్యధికంగా కడప జిల్లాకు చెందిన అభ్యర్థులు పరీక్షలు రాయగా.. అతి తక్కువగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు పరీక్షలు రాసినట్లుగా గుర్తించారు. అతి తక్కువ మంది పరీక్షలు రాసిన శ్రీకాకుళంలోనూ 70 శాతానికి పైనే అభ్యర్థులు పరీక్షలు రాయటం గమనార్హం. వైరస్ విరుచుకుపడుతున్న వేళలోనూ.. ఉద్యోగ అవకాశాల కోసం ఎంతలా తపిస్తున్నారన్న విషయం తాజా పరీక్షల్ని చూస్తే.. ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.