Begin typing your search above and press return to search.

బెంగళూరులో అమ్మకానికి అన్ని హోటళ్లు ఉన్నాయట

By:  Tupaki Desk   |   2 July 2021 11:30 PM GMT
బెంగళూరులో అమ్మకానికి అన్ని హోటళ్లు ఉన్నాయట
X
మాయదారి కరోనా ఎంతలా దెబ్బేసిందన్న విషయాన్ని ఎంత చెప్పుకున్నా తక్కువే. గడిచిన వందేళ్లలో ప్రపంచం మొత్తం ఒకే ఇష్యూ మీద తీవ్రమైన నష్టానికి.. ప్రభావానికి.. విషాదానికి గురైన ఉదంతం ఏదైనా ఉందంటే.. అది కరోనా మహమ్మారితోనే. మొదటి వేవ్ గండం నుంచి బయటపడినప్పటికీ సెకండ్ వేవ్ దెబ్బకు భారత్ ఎంతలా అతలాకుతలమైందో తెలిసిందే. అధికారిక లెక్కల్ని పక్కన పెడితే.. దేశంలోని ప్రతి ఒక్కరు తమకు తెలిసిన వారు కనీసం నలుగురైదుగురు మరణించిన వార్తలు కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా విన్నవారే.

అంతటి దారుణ పరిస్థితి నెలకొంది. కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ప్రభావానికి గురి కావటమే కాదు.. రాష్ట్రాలు సైతం పన్ను ఆదాయాన్ని భారీగా కోల్పోయి కిందా మీదా పడుతున్నాయి. ప్రభుత్వాల పరిస్థితి ఇలా ఉంటే.. వ్యక్తిగత ఆదాయం విషయంలోనూ తీవ్ర ప్రభావానికి గురైనోళ్లు కోట్లల్లో ఉన్నారు. ఇది సరిపోదన్నట్లుగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోవటం.. వివిధ వ్యాపార సంస్థలకు కోలుకోనంత దెబ్బ తగలటం తెలిసిందే.

దేశంలో అత్యున్నత ప్రమాణాలతో హోటళ్లను నిర్వహించే సత్తా ఎవరికైనా ఉందంటే అది కన్నడిగులకు మాత్రమే. దేశంలోని ఏ మూలకు వెళ్లినా ఉడిపి హోటల్ ఒకటి ఉంటుంది. వారు హోటళ్లను నిర్వహించే విషయంలో ఉండే నేర్పు చాలామందికి రాదు. అంతటి నైపుణ్యం ఉన్న వారిని సైతం కరోనా దారుణంగా దెబ్బ తీసింది. కర్ణాటక రాష్ట్రంలో హోటల్ రంగం దారుణంగా దెబ్బ తింది. ఈ కారణంతోనే ఆ రాష్ట్రంలో అమ్మకానికి పదివేల హోటళ్లు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర హోటళ్ల యజమానుల సంఘం చెబుతోంది.

కర్ణాటకలో హోటళ్లు.. రెస్టారెంట్లు మొత్తంగా కలిపి 70 వేలు రిజిస్ట్రేషన్లు చేయించుకోగా.. మరో10 వేలకు పైనే హోటళ్లు ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేకుండా బిజినెస్ లు చేస్తుంటాయి. ఇదిలా ఉంటే.. ఆ రాష్ట్ర రాజధాని.. దేశీయ ఐటీకి గమ్యస్థానంగా చెప్పే బెంగళూరు మహానగరంలో పెద్ద ఎత్తున హోటళ్లు.. రెస్టారెంట్లు ఉంటాయి. వీటిల్లో దాదాపు 2500 హోటళ్లు కరోనా కారణంగా అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఉన్న హోటళ్లలో కొన్ని మాత్రమే ఓపెన్ అయ్యాయి. మరికొద్ది రోజుల్లో థర్డ్ వేవ్ విరుచుకుపడుతుందన్న అంచనాల నేపథ్యంలో హోటళ్లను తెరవటం లేదు. దీంతో..దీర్ఘకాలిక నష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న యజమానులు.. వాటిని అమ్మేసుకోవాలని సిద్ధం అవుతున్నట్లు చెబుతున్నారు.