Begin typing your search above and press return to search.

రాష్ట్రాలకు నేతిబీరలో నేతిని చూపిన మోడీ సర్కారు

By:  Tupaki Desk   |   27 Aug 2020 12:30 PM GMT
రాష్ట్రాలకు నేతిబీరలో నేతిని చూపిన మోడీ సర్కారు
X
సమాఖ్య దేశంలో కేంద్రం.. రాష్ట్రాల మధ్య సంబంధాలు ఇచ్చి పుచ్చుకునే రీతిలో ఉండాలి. రూల్ పుస్తకాల్లో ఉండే దానికి వాస్తవానికి మధ్య వ్యత్యాసం ఎంతో.. కేంద్ర.. రాష్ట్రాల మధ్య సంబంధాలు అదే రీతిలో ఉంటాయన్నది అందరికి తెలిసిందే. బొటాబొటిగా మెజార్టీ ఉన్న ప్రభుత్వాలు కేంద్రంలో కొలువు తీరిన వేళలో.. రాష్ట్రాల హవా నడిచేది. దీంతో.. పెద్ద రాష్ట్రాలు తరచూకేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి తమకు కావాల్సిన పనుల్ని పూర్తి చేసుకునే అవకాశం ఉండేది.

ఎప్పుడైతే మోడీ సర్కారు కొలువు తీరిన తర్వాత నుంచి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. దేశ వ్యాప్తంగా తనకున్న ఇమేజ్ ఎంతన్న విషయంపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో రాష్ట్రాలకు చెక్ పెట్టే పనికి శ్రీకారం చుట్టింది. మొదటిసారి పగ్గాలు చేపట్టిన వేళలో కాస్త ముందు వెనుకా అన్నట్లుగా ఉండే మోడీ సర్కారు.. మోడీ సర్కారు-2లో మాత్రం రాష్ట్రాలకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోవటం అంతకంతకూ ఎక్కువైందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

దీనికి తగ్గట్లే.. కేంద్ర నిర్ణయాలు ఉండటం గమనార్హం. ఈ తీరుపైనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ విమర్శలు చేస్తుంటారు. లాక్ డౌన్ వేళ మోడీ సర్కారు తీరుపై ఆ మధ్యన కేసీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రాలు సంధించే ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా.. తానేం చేయాలో చేసుకుంటూ పోయే విలక్షణత మోడీ సర్కారు సొంతం.

రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేసే ఆయన తీరుపై బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటారు. తాజాగా అలాంటి పరిస్థితే మరోసారి ఎదురైందని చెప్పాలి. ఈ రోజు (గురువారం) జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం నుంచి రాష్ట్రాలు చాలానే ఆశించాయి. కరోనా నేపథ్యంలో రాష్ట్రాల ఆదాయంభారీగా పడిపోయిన నేపథ్యంలో.. కేంద్రం ఇచ్చే పన్ను వాటాను కాస్త పెంచుతారని భావించించాయి. అందుకు భిన్నంగా జీఎస్టీ సమావేశం జరిగినట్లుగా చెబుతున్నారు.

రాష్ట్రాలకు కాసులు విదిల్చేందుకు కేంద్రం ససేమిరా అనటమేకాదు.. కరోనా నేపథ్యంలో చితికిన రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు వీలుగా ఎలాంటి ప్రోత్సాహాకాల్ని ప్రకటించకుండానే సమావేశం ముగిసింది. దీంతో.. రాష్ట్రాలు తీవ్ర నిరాశకు గురయ్యాయి. రాష్ట్రాల రాబడి పెరిగేలా కేంద్ర నిర్ణయం ఉంటుందన్న దానికి బదులుగా..అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని చూపుతూ.. కోవిడ్ 19 వల్ల జరిగిన నష్టాల్ని భర్తీ చేయాల్సిన అవసరం తనకు లేదని చెప్పి తప్పించుకోవటం రాష్ట్రాలకు షాకింగ్ గా మారింది.
కేంద్రం తీరుపై పంజాబ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి మన్ ప్రీత్ బాదల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం వైఖరిని ప్రశ్నించారు. అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని తమకు ముందుగానే ఎందుకు అందించలేదని నిలదీశారు. చాలామంది అంచనాలకు తగ్గట్లే.. రాష్ట్రాలకు కేంద్రం హ్యాండిస్తుందన్న మాటకు తగ్గట్లే తాజా సమావేశం జరిగిందని చెప్పక తప్పదు.