Begin typing your search above and press return to search.

జగన్ కు మద్దతిస్తేనే వారి చిత్తశుద్ధిని నమ్మొచ్చు

By:  Tupaki Desk   |   1 March 2018 11:31 AM GMT
జగన్ కు మద్దతిస్తేనే వారి చిత్తశుద్ధిని నమ్మొచ్చు
X
ప్రత్యేకహోదా సాధన పేరు చెప్పి.. పోరాటాలు సాగిస్తున్నాం అని చాటుకుంటున్న వారు ఇవాళ అనేకమంది తయారవుతున్నారు. కానీ అందరూ కలిసి ఒకే లక్ష్యం కోసం పోరాడుతున్నప్పుడు.. అందరూ కలిసి ఒక్క గొంతుకతో నినదిస్తే ఢిల్లీ పీఠం కింద ప్రకంపనలు పుడతాయి కదా.. అనేది ప్రజల ఆశ. కానీ రాజకీయ పార్టీలు మాత్రం ఎవరికి వారు. విడివిడిగా తమ పోరాటాలు చేయడానికి సిద్ధమవుతుండడం శోచనీయం. తాజా పరిస్థితిని గమనిస్తే.. మార్చి 5నుంచి పోరాటాలు ఉధృతం కానున్నాయి.

ఆ రోజున పార్లమెంటు సమావేశాలు మొదలవుతాయి. అదే రోజున ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులందరికీతో కలిపి చాలా పెద్దస్థాయిలో ధర్నా నిర్వహించబోతున్నారు. ప్రత్యేకహోదా డిమాండ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఏపీలోని ప్రత్యేకహోదా సాధన సమితి నేతృత్వంలో అన్నిపార్టీల కూటమి కూడా కూడా గేరప్ అవుతోంది. మంచిదే. వారు కూడా ఈనెల 5 నుంచి 9 వరకు ఛలో ఢిల్లీ నిర్వహించాలని పిలుపు ఇస్తున్నారు. అది కూడా మంచిదే. అయితే 5 వ తేదీన ఢిల్లీలో జరిగే జగన్ పార్టీ ధర్నాకు వారు సంఘీభావం ప్రకటించవచ్చు కదా..! పార్టీ రహితంగా మద్దతివ్వవచ్చు కదా.. ! ప్రజల కోరిక ఇలా ఉంది గానీ.. ఈ ఐక్య కూటమిలో ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సనల్ ఎజెండాతో పనిచేస్తుంటారు. వారెవ్వరూ అంగీకరించకపోవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.

ఎక్కడైనా సరే.. ఏ పోరాటం అయినా సరే.. సమైక్యంగా అందరూ కలిసి పోరాడితే లభించే ఫలితం వేరు. ఇక్కడైనా అంతే. కానీ సాధన సమితి పేరుతో మేధావులుగా చెలామణీ అవుతున్నవాళ్లు.. రాజకీయ ఎజెండా లేకుండా పోరాడుతున్నాం అనేవాళ్లు.. హిడెన్ ఎజెండాలతో పోరాటానికి చేటు చేస్తున్నారనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది.

అందరూ ఒకటే పనికోసం ఒకటే వేదిక ఢిల్లీలోనే పోరాడాలని అనుకుంటున్నప్పుడు.. అదే రోజున జరుగుతున్న వైసీపీ దీక్షకు మద్దతిస్తే తప్పేముంది అనేది ప్రజల ఆలోచన. ఎటూ జగన్ అందరికంటె ముందే తన పోరాట ఎజెండాను ప్రకటించారు. ఎవరు తమతో కలిసి వచ్చినా.. కలిసి పోరాడదాం అని కూడా చెప్పారు. మరి వీరు ఇలా ఏదో రహస్య ఎజెండాలతో ఉన్నంత కాలమూ రాష్ట్రానికి నష్టం కాక మరేమిటి? మరొకరు చేసే పోరాటానికి మద్దతివ్వలేని వారి వైఖరిలో చిత్తశుద్ధి ఉన్నదని నమ్మడం ఎలాగని ప్రజలు అంటున్నారు.