Begin typing your search above and press return to search.

రాజ‌మండ్రి సీటు!... అన్ని పార్టీలకూ టెన్ష‌నే!

By:  Tupaki Desk   |   6 March 2019 1:30 PM GMT
రాజ‌మండ్రి సీటు!... అన్ని పార్టీలకూ టెన్ష‌నే!
X
తూర్పు గోదావ‌రి జిల్లా... ఏపీ రాజ‌కీయాల్లో సెంటిమెంట‌ల్ జిల్లా. ఈ జిల్లాలో ఏ పార్టీకి మెజారిటీ సీట్లు వ‌స్తాయో... రాష్ట్ర స్థాయిలోనూ అదే పార్టీకి మెజారిటీ ఖాయం. ఇదేదో ఇప్పుడిప్పుడే ఏర్ప‌డిన సెంటిమెంట్ కాదు. తెలుగు నేల ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న‌ప్ప‌టి నుంచి కూడా ఇదే సెంటిమెంట్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఏపీలోనే కాకుండా మొత్తం తెలుగు నేల‌లోనే అత్య‌ధిక ఎమ్మెల్యే సీట్ల‌(19)తో పాటు అత్య‌ధిక ఎంపీ(3) సీట్ల‌ను క‌లిగిన ఈ జిల్లాలో... నిజంగానే ఏ పార్టీకి మెజారిటీ వ‌స్తుందో, ఆ పార్టీకి ఏపీలో అధికార పీఠం ద‌క్కేసిన‌ట్టే. ఇంత‌టి ప్రాధాన్యం క‌లిగిన జిల్లాలో మిగిలిన సీట్ల‌ను ప‌క్క‌న‌బెడితే... చారిత్రక ప్రాధాన్యం క‌లిగిన రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎంపీ సీటు మ‌రింత కీల‌క‌మ‌నే చెప్పాలి. ఈ సీటు నుంచి పోటీ చేసేందుకు అన్ని పార్టీల‌కు చెందిన తూర్పు నేత‌లంతా ఆస‌క్తి క‌న‌బ‌రుస్తారు. అయితే అదేంటో గానీ.. మ‌రో రెండు నెల‌ల్లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి ఈ సీటు నుంచి పోటీ చేసేందుకు ఏ ఒక్క‌రు కూడా ముందుకు రావ‌డం లేదు.

ఈ త‌ర‌హా ప‌రిస్థితి తొలుత అధికార టీడీపీలో త‌లెత్త‌గా... ఇప్పుడు విప‌క్ష వైసీపీలోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి నెల‌కొంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ స్థానం నుంచి టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడికి అత్యంత స‌న్నిహితుడిగా పేరున్న సీనియ‌ర్ నేత మాగుంట మురళీమోహ‌న్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ముర‌ళీమోహ‌న్‌నే రంగంలోకి దించాల‌ని చంద్ర‌బాబు తొలుత ఆలోచించినా... ఆ సీట‌ను బీసీల‌కు కేటాయిస్తున్న‌ట్లు వైసీపీ ప్ర‌క‌టించ‌గానే... త‌న వ్యూహం మార్చేసిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌ను ముందుగానే ప‌సిగట్టిన ముర‌ళీమోహ‌న్.. చంద్ర‌బాబు నుంచి పిలుపు రాక‌ముందే.. ఈ ద‌ఫా అక్క‌డి నుంచే కాకుండా ఎక్క‌డి నుంచి కూడా పోటీ చేయ‌న‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో బీసీ మంత్రం ప‌ఠిస్తున్న వైసీపీని రాజ‌మ‌హేంద్రిలో దెబ్బ కొట్టాలంటే ఏం చేయాలి? ఎవ‌రిని బ‌రిలోకి దించాల‌న్న అంశంపై త‌న‌దైన శైలి మంత‌నాలు సాగించిన చంద్ర‌బాబు... రాజ‌మ‌హేంద్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి, ఎమ్మెల్సీ బొడ్డు భాస్క‌ర‌రామారావు, అవంతి ఇంద్ర‌కుమార్‌, జాస్తి మూర్తిల పేర్ల‌ను ప‌రిశీలించారు. వీరిలో ఏ ఒక్క‌రు కూడా పోటీకి ముందుకు రాలేదు. దీంతో అస‌లు ఇక్క‌డి నుంచి ఎవ‌రిని బ‌రిలోకి దించాల‌న్న విష‌యం తేల‌క చంద్ర‌బాబు త‌ల ప‌ట్టుకున్నట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే... ఇప్పుడు వైసీపీ ప‌రిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేద‌ని తెలుస్తోంది. రాజ‌మ‌హేంద్రి సీటును బీసీల‌కు కేటాయిస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... ఆ వెంట‌నే సినిమాల్లో హీరోగా నిల‌దొక్కునే ప్ర‌య‌త్నాల్లో ఉన్న యువ పారిశ్రామిక‌వేత్త మార్గాని భ‌ర‌త్‌ ను ఆ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీగా ప్ర‌క‌టించారు. జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌కు ఎగిరి గంతేసిన భ‌ర‌త్‌... వెంట‌నే అక్క‌డ బాధ్య‌త‌లు కూడా స్వీక‌రించారు. దాదాపుగా వైసీపీ అభ్య‌ర్థిగా ఆయ‌నే ఖ‌రార‌య్యే అవ‌కాశాలు లేక‌పోలేదు. అయితే ఏమైందో తెలియ‌దు గానీ.. ఇప్పుడు రాజ‌మ‌హేంద్రి ఎంపీ సీటును ఎందుకు ఒప్పుకున్నానా? అని భ‌ర‌త్ అయోమ‌యంలో ప‌డిపోయార‌ట‌. పిలిచి సీటిస్తామంటే ఎగిరి గంతేసిన భ‌ర‌త్‌... ఇప్పుడు పోటీకి ఎందుకు అనాస‌క్తిగా ఉన్నారో అర్ధం కాని ప‌రిస్థితి. మొత్తంగా ఇప్పుడు రాజ‌మ‌హేంద్రి సీటు ఇటు అధికార పార్టీ టీడీపీతో పాటు విప‌క్షం వైసీపీకి కూడా త‌ల‌నొప్పిగానే మారిపోయింద‌న్న మాట‌.