Begin typing your search above and press return to search.

​కేసీఆర్ పై మండింది..అందుకే ఆయ‌న్ను క‌లిశారు

By:  Tupaki Desk   |   14 Aug 2017 9:41 AM GMT
​కేసీఆర్ పై మండింది..అందుకే ఆయ‌న్ను క‌లిశారు
X

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సిరిసిల్లా నియోజ‌క‌వ‌ర్గంలోని నేరేళ్లలో ద‌ళితుల‌పై జ‌రిగిన దాటి ఘట‌న‌పై అఖిల‌పక్ష నేతలు అందోళన ఉధృతం చేశారు. సంఘటన జరిగి 40 రోజలు అవుతున్నా కేవలం ఎస్ఐని మాత్రమే సస్పెండ్ చేశారని పేర్కొంటూ మంత్రి కేటీఆర్ బాధ్యుడిగా చేసి కేబినెట్ నుంచి భ‌ర్తరఫ్ చేయ్యలని డిమాండ్ చేస్తున్నారు. నేరేళ్ల సంఘటకు పై ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణ‌లు చేప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో అఖిల పక్షనేతలు భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి - జానారెడ్డి - షబ్బీర్ అలీ - టీడీపీ నుంచి ఎల్.రమణ - రేవంత్ రెడ్డి - మోత్కుపల్లి నరసింహులు - బీజేపీ నుంచి లక్ష్మణ్ - తెలంగాణ జేఏసీ త‌ర‌ఫున‌ చైర్మన్ ప్రోఫెసర్ కోదండరాం - సీపీఐ ప్ర‌తినిధిగా చాడ వెంకట్ రెడ్డి గ‌వ‌ర్న‌ర్‌ తో స‌మావేశం అయ్యారు.

అనంత‌రం రాజ్‌ భ‌వ‌న్ వ‌ద్దే అఖిల‌ప‌క్ష నేతలు మీడియాతో మాట్లాడుతూ నేరేళ్ల ఘటన జరిగి 40 రోజలు అవుతున్నా ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో రాజ్ భవన్ లో గవర్న‌ర్‌ ను కలిశామ‌ని తెలిపారు. దళితులపై థర్డ్ డిగ్రీకి పాల్పడిన ఎస్పీ - డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని గవ‌ర్నర్ కు విజ్ఞ‌ప్తి చేశామ‌ని వివ‌రించారు. నేరేళ్లలో దళితులపై దాడిజరిగి 40 రోజుల అవుతున్నా భాద్యులను చర్యలు తీసుకోలేదని అందుకే తక్షణం ప్రభుత్వం సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని అఖిల పక్ష నేతలు డిమాండ్ చేశారు. నేరేళ్ల ఘటను భాద్యులైన మంత్రి కేటీఆర్ ను భర్తరఫ్ చేయ్యలని అఖిల పక్షనేతలు కోరారు. పీసీసీ అధ్య‌క్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఖమ్మంలో గిరిజన రైతులకు బేడీలు వేసిన ప్ర‌భుత్వం నేరేళ్లలో దళితులపై దమ‌న నీతి ప్రదర్శించిందని అరోపించారు. ఇసుక మాఫియాలో సీఎం కుటుంబ సభ్యులు ఉన్నారని, వారిని కాపాడటం కోసం దళితులను బలి చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. నేరేళ్ల ఘట‌నకు భాద్యులైన ఎస్పీతో సహా సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఐపీఎస్ లు స్వతంత్రంగా వ్యవహరించాలని కోరుతూ వాళ్లేం ప్రైవేటు సైన్యం కాదన్నారు.

ఇసుక మాఫియా అకృత్యాలు పరాకాష్ఠకు చేరాయని టీడీపీ అధ్య‌క్షుడు ఎల్ రమణ అరోపించారు. నేరెళ్ల బాధితులకు ప‌రామ‌ర్శించిన స‌మ‌యంలో చాలా బాధ క‌లిగిందని ఆయ‌న అన్నారు. కేటీఆర్ మంత్రిగా అనర్హుడని ఆయనను బర్తరఫ్ చేయాలి డిమాండ్ చేశారు. నేరెళ్ల ఘటన పై జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశామని బీజేపీ అధ్య‌క్షులు లక్ష్మణ్ తెలిపారు. ఎస్సీ కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిప‌డ్డారు. ఎస్సైని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవాలనుకుంటున్నారని ఆరోపించారు. ఎస్పీ పై చర్యలు తీసుకొని,
న్యాయవిచారణ జరిపించాలని ల‌క్ష్మ‌ణ్ కోరారు. సంఘట‌న జరిగిన నెల రోజుల‌ తర్వాత మంత్రి కేటీఆర్ వెళ్లడం ఏమిటని సీపీఐ కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ఎస్పీపై అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలను ఇష్టం వచ్చినట్లు కొట్టడం ఫ్రెండ్లీ పోలీస్ అనిపించుకుంటుందా? అని చాడా నిల‌దీశారు.

నేరెళ్ల లో కులం పేరు చెప్పి దళితులను కొట్టారని, మత్తుమందు ఇచ్చి మరీ కొట్టారని టీడీపీ సీనియ‌ర్ నేత‌ మోత్కుపల్లి నరసింహులు అవేదన వ్యక్తం చేశారు. బాధితుల భార్యల పై వ్య‌భిచారం కేసులు పెడతామని బెదిరించారని ఆయ‌న ఆరోపించారు. కేసీఆర్ కు మానవత్వం లేదా అని మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ప్ర‌శ్నించారు. త‌న రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటన చూడలేదని అన్నారు. కేసీఆర్ నేరేళ్లకు వెళ్లలేకపోతే బాధితులను కనీసం ప్రగతి భవన్ కు పిలిపించుకుని ప‌రామ‌ర్శించాల‌ని సూచించారు. నేరేళ్ల సంఘటనపై చర్యలు తీసుకోకపోతే కేసీఆర్ వ్య‌క్తిత్వానికి ఇది మాయని మచ్చ అవుతుందన్నారు. ఇసుక కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే దళితుల పై దాడి చేశారని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోడందరాం ఆరోపించారు. ఏ యంత్రాంగమూ ఇంత వరకు స్పందించలేకపోవడంతో చివ‌రి ప్ర‌య‌త్నంగా గవర్నర్ ను కలిశామ‌ని తెలిపారు. ఆయన ఇచ్చిన హామీ నెరవేరుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఇసుక మాఫియా ఆగ‌డాలు ఆగే వ‌ర‌కు వ‌రకు పోరాడుతామని కోదండ‌రాం స్పష్టం చేశారు.