Begin typing your search above and press return to search.

అఖిలపక్షం రద్దు..బీఏసీలోనే అన్నీ..చైనా అంశంపై పార్లమెంట్ లో చర్చకి నో..!

By:  Tupaki Desk   |   13 Sept 2020 11:15 AM IST
అఖిలపక్షం రద్దు..బీఏసీలోనే అన్నీ..చైనా అంశంపై పార్లమెంట్ లో చర్చకి నో..!
X
రేపటి నుండి (సెప్టెంబర్ 14) .. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో కీలకమైన దాదాపు 11 బిల్లులకి ఆమోదం తెలపాలని కేంద్రం భావిస్తుంది. ఇదే తరుణంలో దేశంలో కరోనా విజృంభణ , సరిహద్దు వివాదం పై ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనూహ్య రీతిలో చైనా సరిహద్దు అంశాలపై సభలో చర్చించకూడదని మోదీ సర్కార్ నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండగా, అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహించబోవట్లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రకటించడం గమనార్హం.

జూన్ 15న గాల్వాన్ లోయలో హిసాత్మక ఘర్షణల్లో మన జవాన్లు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 45 ఏళ్ల తర్వాత.. గతవారం చుషూల్ సెక్టార్ లో కాల్పుల మోత కూడ చోటుచేసుకుంది. సైనిక చర్చలు, మాస్కో వేదికగా భారత్, చైనా కేంద్ర మంత్రుల మధ్య జరిగిన చర్చలు సైతం దాదాపు ఫెయిల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు సరిహద్దులో ఏం జరుగుతున్నదో ప్రజలకు చెప్పితీరాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తుండగా, సరిహద్దు ఉద్రిక్తతలు చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దీనిపై బహిరంగంగా చర్చించడం కరెక్ట్ కాదని, అందుకే ఈ వర్షాకాల సమావేశాల్లో చైనాపై చర్చ ఉండబోదని ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

చైనాతో సరిహద్దు గొడవలకు సంబంధించి రాబోయే రెండు వారాల్లో కీలకమైన పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని, అవి జరగకముందే పార్లమెంట్ లో చర్చ జరపడం సరికాదని సీనియర్ కేంద్ర మంత్రి అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మేం చర్చకు భయపడట్లేదు. కీలక అంశాలపై పార్లమెంట్ లో సమగ్రంగా వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ చైనాతో సరిహద్దు వ్యవహరాలు చాలా సున్నితమైనవి. జాతీయ భద్రత, దేశ సమగ్రతకు మరియు సమగ్రతకు సంబంధించిన వ్యూహాత్మక అంశాలను బహిరంగంగా చర్చించడం సబబు కాదు అని తెలిపారు. అయితే , దీన్ని ప్రతిపక్షాలు గట్టిగా వ్యతిరేకించే అవకాశముంది. ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సరిహద్దు వివాదంపై రోజుకో స్టేట్మెంట్ ఇస్తూ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. శుక్రవారం జరిగిన ‘‘రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ' భేటీలో ఎన్సీపీ నేత శరద్ పవార్.. సరిహద్దు అంశాలపై త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ పై ప్రశ్నల వర్షం కురిపించారు.

సభలో ప్రతిపక్షాలు గొడవకు దిగే అవకాశాలున్న నేపథ్యంలో .... పరిస్థితి మరీ గందరగోళంగా మారితే.. రక్షణ మంత్రి రాజ్ నాథ్ చేత బ్రీఫింగ్ మాత్రం ఇప్పించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రతి పార్లమెంట్ సెషన్ ప్రారంభానికి ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నదే. అయితే ఈసారి మాత్రం కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించబోవడంలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, ఉభయ సభల బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) మీటింగ్ మాత్రం ఆదివారం యధావిధిగా జరుగనుంది. అందులోనే సభా కార్యకలాపాలపై పూర్తి క్లారిటీ రానుంది. సోమవారంన ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అక్టోబర్ 1 వరకు కొనసాగనున్నాయి.