Begin typing your search above and press return to search.

మోడీ ప్ర‌మాణ‌స్వీకారంలో అంద‌రి చూపు దానిమీద‌నే!

By:  Tupaki Desk   |   30 May 2019 5:14 AM GMT
మోడీ ప్ర‌మాణ‌స్వీకారంలో అంద‌రి చూపు దానిమీద‌నే!
X
విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు.. తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త‌.. విప‌క్ష వ్యంగ్య‌స్త్రాలు.. ఇలా హోరాహోరీగా సాగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంగ్రామం ఫ‌లితాలు వ‌చ్చేయ‌టం.. మోడీ ఘ‌న విజ‌యాన్ని సాధించ‌టం తెలిసిందే. 2014లో మోడీ వేవ్ మీద విజ‌యం సాధించిన‌ట్లుగా ప‌లువురు చెబుతారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం.. తాజా ఎన్నిక‌ల వేళ‌లో మోడీ మీద తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. కానీ.. ఫ‌లితాలు మాత్రం 2014 కంటే మెరుగ్గా రావ‌టం విశేషం.

రెండోసారి దేశ ప్ర‌ధానిగా మోడీ ఈ రోజు (గురువారం) ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి విదేశీ.. స్వ‌దేశీ ప్ర‌ముఖులు పెద్ద ఎత్తున వ‌స్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు అంద‌రి దృష్టి మోడీ వ‌స్త్ర‌ధార‌ణ మీదే ఉంది. పాల‌న ప‌రంగా మోడీ ఎలాంటి మార్క్ వేశారో.. త‌న వ‌స్త్ర‌ధార‌ణ మీద కూడా మోడీ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ ప్ర‌ద‌ర్శిస్తుంటారు.

ఆయ‌న వ‌స్త్రధార‌ణ శృతిమించుతోందంటూ ఆ మ‌ధ్య‌న పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు కూడా వెల్లువెత్తాయి. అయిన‌ప్ప‌టికీ త‌న‌కు ఇష్ట‌మైన విష‌యంలో ఆయ‌న త‌న తీరు మార్చుకోలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు వినూత్న‌మైన డిజైన్లను ఆయ‌న ధ‌రిస్తుంటారు. అలాంటి వేళ‌.. తాజా ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి ఎలాంటి వ‌స్త్రాలు ధ‌రిస్తార‌న్న ఆస‌క్తి ఇప్పుడు వ్య‌క్త‌మ‌వుతోంది.

సాధార‌ణంగా ఇలాంటి చ‌ర్చ టాప్ హీరోయిన్లు.. సెల‌బ్రిటీలకు మాత్ర‌మే ఉంటుంది. రాజ‌కీయ రంగానికి చెందిన వారి వ‌స్త్రాల మీద దేశంలో పెద్ద‌గా చ‌ర్చ జ‌ర‌గ‌దు. దానికి భిన్నంగా మోడీ డ్రెస్సింగ్ మీద ఎప్ప‌టిక‌ప్పుడు ఆస‌క్తి వ్య‌క్త‌మ‌వుతూ ఉంటుంది. 2014 ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం సంద‌ర్భంగా మోడీ క్రీమ్ క‌ల‌ర్ కుర్తా.. పైజ‌మా ధ‌రించారు. కుర్తా పైన బంగారు రంగు హాఫ్ స్లీవ్ జాకెట్ తో పాటు అందుకు మ్యాచ్ అయ్యేలా బ్లాక్ క‌ల‌ర్ షూస్ ధ‌రించారు. ఈ త‌ర‌హా వ‌స్త్ర‌ధార‌ణ మోడీకి హుందాత‌నాన్ని ఇచ్చింది.

ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో అందుకు త‌గ్గ‌ట్లు వ‌స్త్రాల్ని ధ‌రించ‌టం మోడీకి అల‌వాటు. ఆ మ‌ధ్య‌న ఒబామా దేశానికి వ‌చ్చిన సంద‌ర్భంగా.. అమెరికా తొలి మ‌హిళ కంటే ఎక్కువ‌సార్లు వ‌స్త్రాల్ని మార్చిన‌ మోడీ తీరు వార్తాంశమైంది. విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌ప్పుడు ఒక‌లా.. దేశంలో జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల‌కు ఒక‌లా వ్య‌వ‌హ‌రించే మోడీ.. తాజా ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం సంద‌ర్భంగా ఎలాంటి దుస్తులు ధ‌రిస్తార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుండ‌టం విశేషం.