Begin typing your search above and press return to search.

కరోనా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే.. కేసీఆర్ నిర్లక్ష్యమే కారణం: బండి

By:  Tupaki Desk   |   29 April 2021 1:00 PM IST
కరోనా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే.. కేసీఆర్ నిర్లక్ష్యమే కారణం: బండి
X
తెలంగాణలో కరోనా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కరోనాతో రాష్ట్రంలో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా సీఎం కేసీఆర్ మాత్రం కనీసం సమీక్ష నిర్వహించడం లేదని బండి ధ్వజమెత్తారు. కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడం లేదని బండి ప్రశ్నించారు. లేదంటే ఆయుష్మాన్ భారత్ ను వెంటనే తెలంగాణలో అమలు చేయాలని బండి డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా మరణాలను తక్కువ చూపించడం వల్లే ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ప్రభుత్వం మరణాలను తక్కువ చేసి చూపిస్తోందని ఆయన ఆరోపించారు.ఇప్పటికైనా కేసీఆర్ కరోనా మరణాలు, పాజిటివ్ కేసుల సంఖ్యను పారదర్శకంగా కేంద్రానికి ఇవ్వాలని బండి డిమాండ్ చేశారు.

వ్యాక్సిన్ తీసుకోని కేసీఆర్, మంత్రులు ప్రజలకు ఎలా నమ్మకాన్ని కలిగిస్తారని.. ప్రజలకు వ్యాక్సిన్ తీసుకోవాలని ఎలా చెబుతారని బండి సంజయ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ ఇస్తున్న సూచనలు, సలహాలు తీసుకోవాలని బండి డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో కేసులు, మరణాలు తీవ్రస్తాయిలో ఉన్నాయని.. ఇలా కష్టకాలంలో భరోసా ఇవ్వని సీఎం కేసీఆర్ ఉంటే ఏంటి? లేకుంటే ఏంటి అని బండి విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో కరోనాపై కేసీఆర్ చులకనగా మాట్లాడడం వల్లే ప్రజలు లైట్ తీసుకున్నారని బండి ఆరోపించారు.