Begin typing your search above and press return to search.

చైనా కుబేరుడ్ని రూ.2లక్షల కోట్లకు దెబ్బేసిన ఒక వార్త!

By:  Tupaki Desk   |   6 May 2022 4:00 AM GMT
చైనా కుబేరుడ్ని రూ.2లక్షల కోట్లకు దెబ్బేసిన ఒక వార్త!
X
అవును.. ఒక వార్త చైనా కుబేరుడికి నిమిషాల వ్యవధిలోనే రూ.2లక్షల కోట్లు దెబ్బేసేలా చేసింది. భయంతో స్టాక్ మార్కెట్ గజగజలాండింది. అయితే.. పబ్లిష్ అయిన వార్తలో ఏ మాత్రం నిజం లేదని.. అదంతా తప్పుగా అర్థం చేసుకోవటం వల్లనే అన్న విషయంపై స్పష్టత వచ్చిన తర్వాత నుంచి రికవరీ పొజిషన్ లోకి మారినప్పటికి.. ఈ మొత్తం ఎపిసోడ్ ను చూస్తే.. అపర కుబేరుడికి సైతం షాకిచ్చేలా చేసే పవర్ వార్త సొంతమన్నట్లు ఉంది. ఇంతకీ ఆ వార్త ఏంటి? ఎవరి విషయంలో అలా జరిగిందన్న విషయంలోకి వెళితే..

చైనా కుబేరుడిగా సుపరిచితుడు జాక్ మా విషయంలోనే ఇదంతా చోటు చేసుకుంది. చైనా అధికారిక మీడియా సంస్థ 'గ్లోబల్ టైమ్స్ 'లో వచ్చిన ఒక వార్త ఇన్వెస్టర్లను.. స్టాక్ మార్కెట్ ను కుదిపేసింది. 'జాక్ మా' అరెస్టు అయ్యారన్న వార్త రావటం.. అలా వచ్చిన వార్తతో అలీబాబా ఇన్వెస్టర్లు భయానికి లోనై తమ వద్ద ఉన్న షేర్లను తెగనమ్మే ప్రయత్నం చేయటంతో నిమిషాల వ్యవధిలో కంపెనీ మార్కెట్ విలువ రూ.2లక్షల కోట్ల మేర ఆవిరైంది. అయితే.. ఆ వార్త 'అలీబాబా' జాక్ మాకు ఎలాంటి సంబంధం లేదని తేలిన తర్వాత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి.

ఎందుకిలా అంటే.. 'మా' అన్నంతనే జాక్ మా అని అందరూ అనుకున్నారు. నిజానికి ఆ పేరు మీద ఉన్న మరో వ్యక్తి విషయంలో వచ్చిన వార్తను తప్పుగా అర్థం చేసుకోవటంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. దీనికి తోడు జాక్ మాకు ఇటీవల కాలంలో ఎదురుదెబ్బలు తగులుతుండటం.. 2020 నుంచి చైనా సర్కారు అతగాడి మీద ఉక్కుపాదం మోపుతూ.. ఏ మాత్రం అవకాశం వచ్చినా అతడ్ని దెబ్బేసేలా వ్యవహరించటంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. 2020లో చైనా జాతీయ బ్యాంకులపై ఆయన విమర్శలు చేసిన తర్వాత అతడ్ని అదుపులోకి తీసుకున్నట్లుగా వార్తలు రావటం.. అప్పటి నుంచి బయట ప్రపంచానికి కనిపించకుండా పోవటం తెలిసిందే.

గ్లోబల్ టైమ్స్ లో వచ్చిన వార్త సారాంశం ఏమంటే.. జాతీయ భద్రతా ఉల్లంఘనల నేపథ్యంలో ఐటీ డైరెక్టర్ 'మా' అనే వ్యక్తిని హాంగ్ జూ పట్టణంలో అరెస్టు చేసినట్లుగా పేర్కొన్నారు. అయితే.. అలీబాబా సంస్థ ప్రధాన కార్యాలయం కూడా హాంగ్ జూ పట్టణంలోనే కావటం.. అరెస్టు చేసింది అక్కడే కావటంతో.. ఇన్వెస్టర్లు పొరబడటం.. ఆ వెంటనే భయాందోళనకు గురి కావటంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.

గ్లోబల్ టైమ్స్ కథనంతో నిమిషాల వ్యవధిలో అలీబాబా షేరు హాంగ్ కాంగ్ స్టాక్ ఎక్సైంజ్ లో 9.4 శాతం మేర తుడిచిపెట్టుకుపోయింది. ఆ తర్వాత రికవరీ అయ్యింది. కాకుంటే.. భయాందోళనలతో తమ వద్ద ఉన్న షేర్లను ఎవరైతే అమ్ముకున్నారో.. వారంతా తీవ్రంగా నష్టపోయారు.