Begin typing your search above and press return to search.

రైల్వే వెబ్ సైట్ లో ఆల్ ఖైదా సందేశం

By:  Tupaki Desk   |   2 March 2016 5:35 AM GMT
రైల్వే వెబ్ సైట్ లో ఆల్ ఖైదా సందేశం
X
భారత రైల్వేలకు చెందిన ఓ వెబ్ సైట్ ను ఉగ్రవాదులు హ్యాక్ చేశారు. సెంట్రల్ జోన్ పరిధిలోని భుసావల్ డివిజన్ కు చెందిన వెబ్ సైట్ ను ఆల్ ఖైదా టెర్రరిస్టులు హ్యాక్ చేసి అందులో ఉగ్రవాద నేత అసీమ్ ఉమర్ మెసేజ్ ను ఉంచారు. మొత్తంలో 11 పేజీలున్న ఈ సందేశంలో ఉగ్రవాద భావజాలాన్ని విస్తరించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఉగ్రవాద చర్యలను సూచిస్తూ హెచ్చరికలు ఉన్నాయి. భారత ముస్లింలు జీహాద్ పాఠాలు మర్చిపోతున్నారని... వారికి మళ్లీ పాఠాలు నేర్పి యుద్ధ రంగానికి కదిలేలా చేస్తామని అందులో పేర్కొన్నారు.

కాగా సెంట్రల్ రైల్వేల్లోని అయిదు డివిజన్లలో భుసావల్ ఒకటి. మొత్తం 115 రైల్వే స్టేషన్లు ఉన్న ఈ డివిజన్ వెబ్ సైట్ కు ట్రాఫిక్ కూడా బాగా ఎక్కువే. నిత్యం వేలాది మంది సిబ్బంది, ఇతరులు ఈ సైట్ ను సందర్శిస్తుంటారు. మహారాష్ట్రలోని జల్ గావ్ జిల్లాను కవర్ చేసే ఈ డివిజన్ పరిధిలో ముస్లిం జనాభా ఎక్కువే. సుమారు 15 శాతం ముస్లిం జనాభా అక్కడ ఉంది. ఈ అన్ని కారణాల వల్ల తమ భావజాల విస్తరణకు ఆ సైట్లో తమ సందేశాన్ని ఉంచేందుకు ఆల్ ఖైదా ఈ పనిచేసినట్లు భావిస్తున్నారు. అంతేకాదు... అత్యంత కీలకమైన రైల్వేశాఖలో పటిష్ఠమైన భద్రత వ్యవస్థ ఉన్న వెబ్ సైట్ ను కూడా హ్యాక్ చేయగలమని నిరూపించేందుకు ఈ పనిచేశారని అనుకుంటున్నారు.

మరోవైపు ఈ సైట్లో తన సందేశాన్ని ప్రకటించిన అసీమ్ ఉమర్ ఆల్ ఖైదా దక్షిణాసియా విభాగానికి చీఫ్. ఆయన అసలు పేరు సనౌల్ హక్. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆయన బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత ఉగ్రవాదుల్లో కలిశారు. 1995 తరువాత ఉమర్ జాడ భారత నిఘా వర్గాలకు తెలియలేదు. గత ఏడాది ఆయన్ను దక్షిణాసియా ఆల్ ఖైదా విభాగానికి చీఫ్ గా నియమించిన తరువాత మళ్లీ నిఘా వర్గాలకు ఆయన ఉనికి తెలిసింది. ఇప్పుడు రైల్వే శాఖ వెబ్ సైట్ హ్యాకింగ్ తో ఆయన తన ఉనికి చాటుకునేందుకు.... విద్రోహ చర్యలకు పాల్పడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడా అన్న కోణంలో నిఘా వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి.