Begin typing your search above and press return to search.

ఆయన ఇప్పుడు థియేటర్లపై పడ్డాడు

By:  Tupaki Desk   |   6 Jun 2018 11:31 AM GMT
ఆయన ఇప్పుడు థియేటర్లపై పడ్డాడు
X
అకున్ సబర్వాల్.. గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిన పేరు. తెలుగు సినీ పరిశ్రమను కుదిపేసిన డ్రగ్ రాకెట్ కుంభకోణానికి సంబంధించిన కేసును డీల్ చేసింది ఆయనే. పూరి జగన్నాథ్.. రవితేజ సహా పలువురు సెలబ్రెటీలకు నోటీసులిచ్చి.. వారిని విచారణకు పిలవడమే కాక.. ఈ రాకెట్లో కీలకమైన వ్యక్తుల్ని అరెస్టు చేయడం ద్వారా ఇండస్ట్రీలో వణుకు పుట్టించారాయన. ఐతే తర్వాత తర్వాత ఈ కేసు మందగించడం.. ఏ అప్ డేట్స్ లేకపోవడంతో అందరూ దీన్ని మరిచిపోయారు. అకున్ సైతం వార్తల్లో లేకుండా పోయారు. ఐతే అకున్ ఇప్పుడు మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. ఇప్పుడాయన కొత్త మిషన్ చేపట్టారు. ఇది కూడా సినిమాలతో ముడిపడ్డ మిషనే కావడంతో మరోసారి ఈ ఐపీఎస్ అధికారి పేరు మార్మోగుతోంది.

సినిమా థియేటర్లలో.. ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో ప్రేక్షకుల్ని ఎలా దోపిడీ చేస్తారో తెలిసిందే. బయట పది రూపాయలుండే తినుబండారాన్ని ఇక్కడ 50 రూపాయలు పెట్టి అమ్ముతారు. అదేంటని అడిగితే.. అదే ధరతో ఉండే ప్రైస్ ట్యాగ్ చూపిస్తారు. ఇక్కడ నిబంధనలేంటన్నది జనాలకు తెలియదు. ఇలా ఏళ్లకు ఏళ్లు దోపిడీ సాగుతోంది. కొన్నిసార్లు టికెట్ల రేట్లు కూడా పెంచి అమ్ముతుంటారు. దీన్ని పట్టించుకునే నాథుడే లేడు. ఐతే ఇప్పుడు అకున్ సబర్వాల్ నేతృత్వంలోని బృందాలు హైదరాబాద్ సిటీలోని పలు మల్టీప్లెక్సులు.. థియేటర్ల మీద దాడులు జరిపాయి. అక్కడ జరుగుతున్న అక్రమాల్ని వెలికి తీశాయి. ఈ వ్యవహారంలో థియేటర్ల యాజమాన్యాలపై దాదాపు వంద కేసులు పెట్టినట్లు సమాచారం. ఈ దాడులతో ఒక్కసారిగా యాజమాన్యాల్లో గుబులు రేగింది. వాస్తవాలు వెలుగులోకి రావడంతో జనాల్లోనూ చైతన్యం వచ్చింది. ధరల విషయంలో ప్రశ్నించే నైజం పెరుగుతోంది. కాకపోతే డ్రగ్స్ రాకెట్ కుంభకోణాన్ని మధ్యలో వదిలేసినట్లే.. ఈ విషయంలో కూడా అకున్ టీం హడావుడి చేసి తర్వాత సైలెంటైపోకుండా ఉంటే బెటర్.