Begin typing your search above and press return to search.

పెద్దోళ్ల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తిస్తోన్న అకున్‌

By:  Tupaki Desk   |   31 July 2017 5:38 AM GMT
పెద్దోళ్ల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తిస్తోన్న అకున్‌
X
డ్ర‌గ్స్ విచార‌ణ ఉదంతం మ‌రోసారి సంచ‌ల‌నాల దిశ‌గా ప్ర‌యాణిస్తోంది. డ్ర‌గ్స్ విచార‌ణ విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కూ రాజీ ప‌డని రీతిలో వ్య‌వ‌హ‌రించిన ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌ర్ అకున్ స‌భ‌ర్వాల్ పేల్చిన బాంబు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డ్ర‌గ్స్ కేసు విచార‌ణ‌లో కొంద‌రు సినిమా పెద్ద‌లు.. బ‌డా పారిశ్రామిక‌వేత్త‌లు.. వ్యాపారుల పిల్ల‌లు ఉన్న‌ట్లుగా ఆయ‌న చెప్ప‌టం.. వారి పేర్ల‌ను వెల్ల‌డించొద్దంటూ త‌మ‌పై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారంటూ ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అకున్ లాంటి ఉన్న‌త అధికారుల‌పై ఒత్తిడి తీసుకొచ్చేంత ద‌మ్ము.. ధైర్యం సామాన్యులు.. సాదాసీదా సినీజీవుల‌కు ఎంత‌మాత్రం ఉండే అవ‌కాశం లేదు. సినిమా రంగంలో ప‌ట్టు ఉంటూ.. రాజ‌కీయంగా ప‌లుకుబ‌డి ఉన్న వారు మాత్రం ఇలాంటివి చేసే అవ‌కాశం ఉందంటున్నారు.

అకున్ మాట‌ల నేప‌థ్యంలో కొన్ని ఆస‌క్తిక‌ర వాద‌న‌లు తెర మీద‌కు వ‌స్తున్నాయి. అకున్ చెప్పిన మాట‌ల‌కు కార‌ణం వీరే అంటూ కొంద‌రికి సంబంధించిన స‌మాచారం సినిమా.. రాజ‌కీయ‌.. మీడియా స‌ర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. పేర్లు బ‌య‌ట‌కు రాకుండా అడ్డుకున్న వారికి సంబంధించి ఇద్ద‌రు బ‌డా నిర్మాత‌ల కుమారులు.. ఒక బ‌డా న‌టుడికుమార్తె.. ప‌త్రికాధిప‌తిని మొద‌టి జాబితాలో చేర్చ‌కుండా మిస్ చేసిన‌ట్లుగా ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ పేర్కొన‌టం సంచ‌ల‌నంగా మారింది.

వీరిని రెండో జాబితాలో అయినా చేరుస్తారా? లేక‌.. వీరి పేర్ల‌ను స్కిప్ చేస్తారా? అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డ్ర‌గ్స్ ఉదంతంలో అధికారాపార్టీకి చెందిన ఒక ప్ర‌ముఖ నేత కుమారుడి పేరు కూడా బ‌య‌ట‌కు రావ‌టం తీవ్ర క‌ల‌క‌లంగా మారింది. స‌ద‌రు నేత పుత్ర‌ర‌త్నం సీమ ప్రాంతానికి చెందిన ఒక మైనింగ్ కాంట్రాక్ట‌ర్ ద్వారా ఎల్ ఎస్ డీని తెప్పించుకున్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ విష‌యం మీద త‌న ద‌గ్గ‌ర ఉన్న స‌మాచారంతోనే ముఖ్య‌మంత్రి కేసీఆర్ సైతం.. డ్ర‌గ్స్ విష‌యంలో ఎంత‌టి వారు ఉన్నా వ‌దిలిపెట్టొద్ద‌ని.. చివ‌ర‌కు క్యాబినెట్ మంత్రుల‌కు సైతం ఎలాంటి మిన‌హాయింపులు ఉండ‌వ‌ని చెప్ప‌టం వెనుక కార‌ణం ఇదేన‌న్న మాట వినిపిస్తోంది.

డ్ర‌గ్స్ విచార‌ణ‌కు త్వ‌ర‌లో వెల్ల‌డించే పేర్ల మీద ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ఈసారి బ‌డా రియ‌ల్ట‌ర్లు.. సినిమాల‌కు ఫైనాన్స్ చేసే వారికి సంబంధించి ఒక ముగ్గురు వ‌ర‌కూ ఉంటార‌ని చెబుతున్నారు. ఇక‌.. ఐటీ కంపెనీల్లో ప‌ని చేసే వారికి నోటీసులు త‌ప్ప‌వ‌ని చెబుతున్నా.. ఐటీ రంగాన్ని ట‌చ్ చేయొద్ద‌ని.. అవ‌స‌ర‌మైతే.. వారి ఆఫీసుల‌కే వెళ్లి వారికి కౌన్సెలింగ్ ఇవ్వాల‌న్న సూచ‌న అందుతున్న‌ట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. రానున్న కొద్ది రోజుల్లో డ్ర‌గ్స్ విచార‌ణ‌కు సంబంధించి మ‌రో బాంబు పేల‌టం ఖాయ‌మ‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.