Begin typing your search above and press return to search.

జ‌న‌సేన‌లోకి బీజేపీ ఎమ్మెల్యే..నిజం కాద‌ట‌!

By:  Tupaki Desk   |   7 Jan 2019 7:57 AM GMT
జ‌న‌సేన‌లోకి బీజేపీ ఎమ్మెల్యే..నిజం కాద‌ట‌!
X
సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీ బీజేపీకి ఊహించ‌ని షాక్ తగిలిందని...బీజేపీకి సీనియర్ నేత, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి జనసేనలో చేరేందుకు రంగం రెడీ అయిపోయారని వ‌చ్చిన వార్త‌ల్లో నిజం లేద‌ని తేలింది. రాజీనామా లేఖ సమర్పించేందుకు ఆయన ఢిల్లీ కూడా చేరుకున్నార‌ని జ‌రిగిన ప్ర‌చారం అవాస్త‌మ‌ని స్వ‌యంగా ఆకుల సత్య‌నారాయణ‌ వివ‌ర‌ణ ఇచ్చారు. త‌న ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద ఢిల్లీ వ‌స్తే...దుష్ప్రచారం చేశార‌ని పేర్కొన్నారు.

ఆకుల సత్యనారాయణ బీజేపీకి రాజీనామా చేసి.. ఆ ప‌త్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు సమర్పించిన త‌ర్వాత‌ అధికారికంగా జనసేన తీర్థం పుచ్చుకోనున్నారని...ఇందులో భాగంగానే ఆయ‌న ఢిల్లీకి చేరుకున్నార‌ని వివిధ మీడియా సంస్థ‌ల్లో వార్త‌లు ప్ర‌చారం అయ్యాయి. చేరిక విష‌య‌మై ఆకుల సంప్రదింపులు జరగా.. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కొన్ని ఛాన‌ల్లు పేర్కొన్నాయి. అయితే, ఆకుల స‌త్య‌నారాయ‌ణ వీటిని ఖండించారు. త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి లేఖను స‌మ‌ర్పించ‌డం, జనసేనలో చేరనున్నట్లుగా వ‌చ్చిన వార్త‌లు అవాస్త‌వ‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తాను ఢిల్లీ వ‌చ్చింది రాజీనామా ఇచ్చేందుకు కాద‌ని, మారెడిమిల్లిలో ర‌బ్బరు రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం వ‌చ్చాన‌ని తెలిపారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా అపాయింట్‌మెంట్ కోరాన‌ని పేర్కొన్న ఆకుల‌... త‌మ జాతీయ అధ్య‌క్షుడి అపాయింట్‌మెంట్ స‌మ‌యం ఇంకా ఖ‌రారు కాలేద‌న్నారు.