Begin typing your search above and press return to search.

తప్పటడుగు..వైసీపీలోకి పోయి సరిచేస్తున్నాడా?

By:  Tupaki Desk   |   24 Sept 2019 4:28 PM IST
తప్పటడుగు..వైసీపీలోకి పోయి సరిచేస్తున్నాడా?
X
ఆకుల సత్యనారాయణ.. మాజీ ఎమ్మెల్యే.. 2014లో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా గెలిచారు. మొన్నటి 2019 ఎన్నికల వేళ.. ఆయన ప్రజల నాడి తెలియకుండా చేసిన ఒకే ఒక తప్పు ఇప్పుడు ఆయనను రాజకీయంగా ఇరకాటం పడేసింది. ఎటూ కాకుండా చేసింది. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆకుల మౌనం దాల్చారు.

2019 ఎన్నికల్లో ఆకుల సత్యనారాయణ రాజకీయాలను అంచనా వేయలేకపోయారు. అప్పటి వరకు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన బీజేపీకి టాటా చెప్పి జనసేనలో చేరారు. ఇక్కడే పెద్ద తప్పు చేశారు. జనసేన పార్టీ ఆయనకు రాజమండ్రి ఎంపీ సీటు ఇచ్చింది. కానీ గెలవలేకపోయారు. అప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు.

జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం ఓడిపోవడం.. ఆ పార్టీలో భవిష్యత్ లేదని తెలిసి తిరిగి ఆకుల సత్యనారాయణ సొంతగూడు బీజేపీలోకి వెళ్లాలని తలంచారు. ఈ మేరకు బీజేపీ నుంచి పిలుపు వస్తుందని కూడా వేచిచూశారు. కానీ బీజేపీ ఆహ్వానించకపోవడంతో ఇప్పుడు అటు జనసేనలో ఇమడలేక.. ఇటు బీజేపీలోకి వెళ్లలేక సతమతమవుతున్నారట..

ఇక ఆకుల చూపు ప్రస్తుతం వైసీపీ వైపు పడిందట.. ఇక రాబోయే మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా రాజమండ్రిలో గట్టి పట్టున్న ఆకులను వైసీపీలో చేర్చుకోవాలని వైసీపీ పెద్దలు ఆసక్తిగా ఉన్నారట.. ఆయన త్వరలోనే వైసీపీలో చేరుతారన్న ప్రచారం ప్రస్తుతం సాగుతోంది. దసరా తర్వాత పార్టీ మారేందుకు ముహూర్తం పెట్టుకున్నట్టు సమాచారం. మొత్తానికి ఎన్నికల ముందర వేసిన తప్పటడుగును ఇప్పుడు వైసీపీలో చేరడం ద్వారా కరెక్ట్ చేసుకుంటున్నారు ఆకుల సత్యనారాయణ..