Begin typing your search above and press return to search.

వారణాసిలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారా ?

By:  Tupaki Desk   |   9 March 2022 12:16 PM IST
వారణాసిలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారా ?
X
ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడైన మరుసటి రోజే ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. లక్నోలో మీడియాతో అఖిలేష్ మాట్లాడుతూ వారణాసిలో ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్ ఈవీఎంలను తరలించినట్లు ఆరోపించారు. అధికారుల్లో కొందరు ఈవీఎంల ట్యాంపరింగ్ కు పాల్పడుతున్నట్లు కూడా అఖిలేష్ ఆరోపణలు చేయటం గమనార్హం.

ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం ఉత్తర ప్రదేశ్ లో మళ్ళీ బీజేపీనే అధికారంలోకి వస్తుంది. ఈ విషయం మొదటి నుండి అందరు అనుకుంటున్నదే. కాకపోతే వివిధ కారణాల వల్ల ఎస్పీకి ఒక్కసారిగా ఊపొచ్చిందంతే. దాంతోనే తాను అధికారంలోకి వచ్చేయటం ఖాయమని అఖిలేష్ పదే పదే చెప్పారు.

అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే అఖిలేష్ కు అంతసీన్ లేదని అర్ధమైపోయింది. ఇంతలోనే ఈవీఎంల ట్యాంపరింగ్ అని, ఈవీఎంలను తరలిస్తున్నారని ఆరోపణలు చేయటం కలకలంరేపింది.

తాజాగా అఖిలేష్ చేసిన ఆరోపణలు మామూలువి కావు. ఏకంగా ఎన్నికల అధికారులు, కలెక్టర్లే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారని, ఈవీఎంలను తరలిస్తున్నారని ఆరోపించటానికి అఖిలేష్ దగ్గరున్న ఆధారాలేమిటో తెలీదు. అఖిలేష్ పదే పదే చెబుతున్నదేమంటే స్ధానిక అభ్యర్ధులకు సమాచారం ఇవ్వకుండా సంబంధించిన అధికారులు ఈవీఎంలను తరలిస్తున్నారని.

పోలింగ్ బూత్ ల నుండి ఈవీఎంలను తరలించటం ఎన్నికల కమిషన్ అధికారుల బాధ్యతల్లో కీలకమైనది. కాకపోతే ఈవీఎంలను స్ట్రాంగ్ గదుల్లో భద్రపరిచేటపుడు, తరిగి తాళాలు తెరిచేటపుడు అన్నీ పార్టీల ప్రతినిధులకు అధికారులు సమాచారం ఇవ్వాలి.

అంతేకానీ పోలింగ్ బూత్ ల నుండి ఈవీఎంలను తరలించేటపుడు కూడా అభ్యర్ధులకు సమాచారం ఇవ్వాలా వద్దా అనే విషయమై సరైన క్లారిటిలేదు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఈవీఎంలను తరలించటమంటే దొంగతనంగానే భావించాలంటున్నారు.

ఈ విషయమై అవసరమైతే కోర్టులో కేసు వేయటానకి కూడా వెనకాడేది లేదంటున్నారు. అయోధ్యలో ఎస్పీ గెలుస్తోందనే కొందరు అధికారులు ఈవీఎంలను ట్యాపరింగ్ చేస్తున్నారంటు అఖిలేష్ గోల మొదలుపెట్టారు. మరిందులో ఎంతవరకు నిజముందో ఎన్నికల కమీషనే తేల్చాలి.