Begin typing your search above and press return to search.

అఖిలేష్, యోగి, ప్రియాంక.. ఒకే రూట్లో!

By:  Tupaki Desk   |   23 Jan 2022 9:34 AM GMT
అఖిలేష్, యోగి, ప్రియాంక.. ఒకే రూట్లో!
X
ఈ సారి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో మునుపెన్న‌డూ లేని రాజ‌కీయ దృశ్యం క‌న‌బ‌డ‌నుందా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. దేశంలోనే కీల‌క‌మైన యూపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం పార్టీల‌న్నీ గ‌ట్టిగా పోరాడుతున్నాయి. అధికారం నిల‌బెట్టుకోవ‌డం కోసం బీజేపీ.. గ‌ద్దె నెక్క‌డం కోసం కాంగ్రెస్‌, స‌మాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ (బీఎస్పీ) త‌దిత‌ర పార్టీలు త‌మ వ్యూహాలు అమ‌లు చేస్తున్నాయి. అందులో భాగంగానే తొలిసారి బీజేపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌, ఎస్పీ అధినేత అఖిలేష్ యాద‌వ్‌, కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

ఆ ఇద్ద‌రు ఓకే..

ఢిల్లీ పీఠానికి ద‌గ్గ‌ర‌దారి కావ‌డంతో యూపీ ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం ప్ర‌ధాన పార్టీలు శాయశ‌క్త‌లా ప్ర‌య‌త్నిస్తున్నాయి. అందుకే ఏకంగా అగ్ర నేత‌లు ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌నున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక్క‌సారి కూడా పోటీ చేయ‌ని యోగి ఆదిత్య‌నాథ్‌, అఖిలేష్‌, ప్రియాంక ఈ సారి బ‌రిలో దిగ‌బోతున్నార‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే బీజేపీ నుంచి యోగి, ఎస్పీ నుంచి అఖిలేష్ పోటీ చేయడం ఖాయ‌మైంది. ఇంకా ప్రియాంక గాంధీ విష‌యంలోనే ఓ స్ప‌ష్టం రావాల్సి ఉంది. తానే యూపీలో కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్థిని అనే అర్థం వ‌చ్చేలా వ్యాఖ్య‌లు చేసిన ఆమె మ‌ళ్లీ యూట‌ర్న్ తీసుకుంది. ఈ నేప‌థ్యంలో ఆమె పోటీ చేస్తుంద‌నే ప్ర‌చారం జోరందుకుంది.

అక్క‌డి నుంచి..

మొద‌ట తాను పోటీకి దూరంగా ఉండి పార్టీని విజ‌యం దిశ‌గా న‌డిపిస్తాన‌ని చెప్పిన అఖిలేష్ ఇప్పుడు మ‌న‌సు మార్చుకున్నారు. అటువైపు యోగి పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డంతో అఖిలేష్ కూడా స‌వాలుకు సై అంటున్నారు. ఆయ‌న ప‌శ్చిమ యూపీలోని మెయిన్‌పురి జిల్లా క‌ర్హాల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో దిగుతార‌ని పార్టీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఎస్పీకి కంచుకోట అయిన ఆ నియోజ‌క‌వ‌ర్గంలో అఖిలేష్ విజ‌యం న‌ల్లేరు మీద న‌డ‌కే అన్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మెయిన్‌పురి లోక్‌స‌భ స్థానం నుంచి ఆయ‌న తండ్రి ములాయం సింగ్ యాద‌వ్ ఎంపీగా ఉన్నారు. దీంతో అఖిలేష్ ఆ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి సిద్ధ‌మ‌య్యారు. గ‌త ఎన్నిక‌ల్లో అజంగ‌ఢ్ నుంచి ఎంపీగా గెలిచిన అఖిలేష్‌.. శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో పోటీప‌డ‌డం ఇదే తొలిసారి. గ‌తంలో 2012లో ఆయ‌న సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు.

యూపీ సీఎం యోగి గోర‌ఖ్‌పుర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీకి సిద్ధ‌మ‌య్యారు. వ‌రుస‌గా అయిదు సార్లు గోర‌ఖ్‌పుర్ లోక‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎంపీగా గెలిచిన ఆయ‌న‌.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో దిగుతున్నారు. ఎమ్మెల్సీగా గెలిచి సీఎంగా కొన‌సాగుతున్న ఆయ‌న ఇప్పుడు పోటీకి సై అంటున్నారు. మ‌రోవైపు బీఎస్పీ నుంచి సీఎం అభ్య‌ర్థిగా మాయావ‌తి ఉన్నారు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ నుంచి ప్రియాంక‌ను సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించి ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశం క‌ల్పించాలని పార్టీలో డిమాండ్లు పెరుగుతున్నాయ‌ని తెలిసింది. అధిష్ఠానం కూడా అందుకు సానుకూలంగా ఉంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో గ‌తంలో అస‌లు రాజ‌కీయాల్లోనే అడుగుపెట్ట‌ని అని చెప్పిన ఆమె.. ఇప్పుడు అసెంబ్లీ స్థానంలో పోటీ చేసే అవ‌కాశం ఉంది.