Begin typing your search above and press return to search.

మోడీ క‌ల‌కు ఊహించ‌ని మ‌ద్ద‌తిచ్చిన రాహుల్ దోస్త్‌

By:  Tupaki Desk   |   6 Jun 2018 1:21 PM GMT
మోడీ క‌ల‌కు ఊహించ‌ని మ‌ద్ద‌తిచ్చిన రాహుల్ దోస్త్‌
X
జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని పిలుపునిస్తున్న ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీకి ఊహించ‌ని మ‌ద్ద‌తు ద‌క్కింది. ఇటీవ‌లి కాలంలో బీజేపీ పాలిత రాష్ర్టాలు - బీజేపీ వ్య‌తిరేక రాష్ర్టాలు అనే తేడాలేకుండా... కాషాయ పార్టీపై ఒకింత తీవ్ర‌ వ్య‌తిరేక‌త మొద‌లైంద‌ని విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్న సంగ‌తి తెలిసిందే. మోడీ పాల‌న మ‌ధ్య‌త‌ర‌గ‌తికి మేలు చేయ‌ని విధంగా సాగ‌డం - ద‌ళితులు - మైనార్టీలు ఆందోళ‌న‌లు చేయ‌డం, ప్రాంతీయ పార్టీల ఎదురుదాడి వంటి కార‌ణాల‌తో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోడీ ప్ర‌భ మ‌స‌క‌బారుతోంద‌ని అంటున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు మోడీ టీం కొత్త ఆలోచ‌న చేసింద‌ని చెప్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభమయ్యే విధంగా లోక్‌ సభ - అసెంబ్లీలకు రెండు విడుతల్లో జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుందా అనే చ‌ర్చోప‌చ‌ర్చ‌లు ఉండ‌గానే కీల‌క భ‌రోసా ద‌క్కింది. ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీతో స‌న్నిహితంగా ఉన్న స‌మాజ్‌ వాదీ దీనికి మ‌ద్ద‌తిచ్చింది.

వన్ నేషన్.. వన్ ఎలక్షన్ అన్న ప్రధాని నినాదానికి ఎస్పీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మద్దతు పలికారు. 2019లో జమిలి ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆ పార్టీ అధినేత బీజేపీని కోరారు. 2019లో జరిగే లోక్‌ సభ ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలంటూ అఖిలేశ్ తమ పార్టీ కార్యకర్తలకు సూచించారు. అసెంబ్లీ - పార్లమెంట్ నియోజకవర్గాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్న వాదనను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా గతంలో సమర్థించారు. దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉన్న రాష్ట్రం యూపీ. అయితే జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇటీవల ఆ రాష్ట్రం ఓ ముసాయిదా తయారు చేసింది. 2019లో ఏకకాలంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని యోగి స్పష్టం చేశారు. ప్రస్తుతం 21 రాష్ర్టాల్లో బీజేపీ పాలన కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు బీజేపీ వ్యవహారంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆ పార్టీ జమిలి ఎన్నికల నిర్వహిణ కోసం కసరత్తు చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అతిపెద్ద పార్టీ సమాజ్‌వాదీ నుంచి మద్దతు లభించింది.

ఇదిలాఉండ‌గా...ఢిల్లీలో జ‌రుగుతున్న చ‌ర్చ ప్ర‌కారం ఉత్తరప్రదేశ్ - రాజస్థాన్ - మధ్యప్రదేశ్ - గుజరాత్ తదితర ఉత్తరాది రాష్ర్టాల బలంతో కేంద్రంలో పూర్తి మెజార్టీ సాధించిన బీజేపీ.. ఆ రాష్ర్టాల్లో వీస్తున్న ఎదురుగాలిని తట్టుకుని నిలబడేలా వ్యూహాలు రచిస్తోంది. 2014లో వచ్చినన్ని సీట్లు ఆ రాష్ర్టాల్లో 2019లో రాకపోతే ఎలా అన్న సందేహం బీజేపీ వ్యూహకర్తలను పీడిస్తోంది. లోక్‌ సభ - రాష్ర్టాల అసెంబ్లీలకు జమిలిగా ఎన్నికలు నిర్వహించే అంశంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నది. ఈనేపథ్యంలో జమిలి ఎన్నికల ద్వారా జాతీయ స్థాయి అంశాలను ముందుపెట్టి రాష్ర్టాల్లో అధికారం సాధించడంతోపాటు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది బీజేపీ వ్యూహమని విశ్లేషకులు అంటున్నారు. ఇందులో భాగంగానే జ‌మిలీ ఎన్నిక‌ల అంశంపై తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఎన్నికల సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం కోరనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. త్వరలో లా కమిషన్ నివేదిక రానున్న నేపథ్యంలో కేంద్రం ఈసీ అభిప్రాయాన్ని తీసుకోనున్నట్టు తెలిసింది. 2019, 2024లో రెండు విడుతలుగా లోక్‌ సభకు - అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్ సిఫారసు చేసే అవకాశం ఉన్నది. జమిలి ఎన్నికల అంశంపై లా కమిషన్ తన నివేదికను ఈ నెలలో కేంద్ర న్యాయశాఖకు సమర్పించనుంది. మరోవైపు రెండు విడుతల్లో జమిలి ఎన్నికలు నిర్వహించాలని సూచిస్తూ నీతి ఆయోగ్ రూపొందించిన నివేదికను కూడా ఎన్నికల సంఘం అభిప్రాయం కోసం కేంద్రం పంపింది.