Begin typing your search above and press return to search.

అఖిలేష్ కు తలనొప్పులు తప్పవా ?

By:  Tupaki Desk   |   15 Jan 2022 1:32 PM IST
అఖిలేష్ కు తలనొప్పులు తప్పవా ?
X
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో రెండు ప్రధాన పార్టీలకు తల నొప్పులు తప్పేట్లు లేవు. కాకపోతే అధికార బీజేపీకి ఒకరకమైతే ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాదీ పార్టీ కి మరో రకమైన తలనొప్పంతే. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన దగ్గర నుండి మూడు రోజుల్లో ముగ్గురు మంత్రులు, ఐదుగురు ఎంఎల్ఏలు బీజేపీకి రాజీనామా చేసి ఎస్పీలో చేరిపోయారు. ఇంకా చాలామంది మంత్రులు, ఎస్పీలు రాజీనామా బాటలో ఉన్నట్లు సమాచారం. దీంతో వెళ్ళిపోయేవాళ్ళని ఆపటమే బీజేపీ అగ్ర నేతలకు పెద్ద తలనొప్పిగా తయారైంది.

ఇక ఎస్పీ సంగతి చూసుకుంటే కత ఇంకో విధంగా ఉంది. ఇపుడు బీజేపీలో నుండి ఎస్పీలోకి చేరిన వాళ్ళకు కచ్చితంగా టికెట్లు కేటాయించాల్సిందే. ఇంతవరకు ఓకేనే కానీ తమ కుటుంబ సభ్యులకు కూడా టికెట్లు డిమాండ్ చేస్తున్నారట. ఎలాగైనా బీజేపీని ఓడించి అధికారంలోకి రావాలన్న టార్గెట్ తో ఎస్పీ అధినేత అఖిలేష్ చిన్నా చితకా కలిసి ఏడు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. ఉన్న 403 సీట్లలో తమ భాగం పోను మిగిలిన వాటిని ఏడు మిత్రపక్షాలకు సర్దుబాటు చేయాలి.

మిత్రపక్షాలకు సీట్లను సర్దుబాటు చేయటమే తలనొప్పిగా మారుతున్న నేపథ్యంలో ఇఫుడు బీజేపీ నుంచి వస్తున్న వారికి కూడా టికెట్ గ్యారెంటీ ఇవ్వాలి. మంత్రులు, ఎంఎల్ఏల హోదాలో వస్తున్నారు కాబట్టి టికెట్లు గ్యారెంటీ ఇచ్చినా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా టికెట్లు కావాలని పట్టుబడుతుండటమే పెద్ద తలనొప్పిగా మారిపోయింది. అలాగే బీజేపీలో నుండి వస్తున్న వారంతా తమ నియోజకవర్గాల్లోనే పోటీ చేయాలనుకుంటారు. అయితే ఈ సీట్లను అఖిలేష్ ఇప్పటికే మిత్రపక్షాలకు హామీ ఇచ్చేశారట. పలానా నియోజకవర్గంలో టికెట్ ఇవ్వలేనంటే బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళకు కోపం. అలాగని సర్దుబాటు చేసుకోమంటే మిత్రపక్షాలకు కోపం.

మొత్తంమీద అకస్మాత్తుగా బీజేపీలో నుండి తన పార్టీలోకి వలసలు పెద్ద ఎత్తున వస్తున్నందకు సంతోషించాలో లేకపోతే వాళ్ళ చేరికలతో మొదలయ్యే తలనొప్పిని భరించాలో అఖిలేష్ కు అర్ధం కాకుండా ఉంది. ఇప్పటికి బీజేపీలో నుండి ఎనిమిది మంది ఎంఎల్ఏలు వచ్చారు. తొందరలోనే మరో 15 మంది ఎంఎల్ఏలు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి వలసలనేవి ఇటు అధికార పార్టీ అటు ప్రధాన ప్రతిపక్షం రెండింటికి తలనొప్పులు తెస్తున్నాయి.