Begin typing your search above and press return to search.

ములాయం కుటుంబం ముక్క‌లు చెక్క‌లేనా?

By:  Tupaki Desk   |   15 Sep 2016 9:57 AM GMT
ములాయం కుటుంబం ముక్క‌లు చెక్క‌లేనా?
X
నెహ్రూ-గాంధీ కుటుంబం దేశ రాజ‌కీయాల్లో కీల‌క‌మైనా కూడా ఉత్త‌ర్ ప్ర‌దేశ్ కు వ‌చ్చేస‌రికి ములాయం కుటుంబానికి తిరుగులేద‌న్న సంగ‌తి రాజ‌కీయాల్లో అంద‌రికీ తెలిసిందే. మొన్నటి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోడీ ప్ర‌భావంతో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో బీజేపీ మొత్తం చాప‌చుట్టేసినా కూడా ములాయం కుటుంబ స‌భ్యులు మాత్రం గెల‌వ‌గ‌లిగారు. ములాయం కుటుంబం త‌ప్ప స‌మాజ్ వాది పార్టీలో వేరే ఎవ‌రూ గెల‌వ‌లేదు. అలాంటి కుటుంబ బ‌లం ములాయం సొంతం. కానీ... ఇప్పుడు అదే కుటుంబం ములాయంకు త‌ల‌నొప్పులు తెస్తోంది. చివ‌ర‌కు బ‌ల‌మైన రాజ‌కీయ కుటుంబం ముక్క‌ల‌వుతుందా... స‌మాజ్ వాది పార్టీ చెక్క‌ల‌వుతుందా అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అంతేకాదు.. కుల రాజ‌కీయాల‌కు పెట్టింది పేరైన యూపీలో ఇప్పుడు అంకుల్ రాజ‌కీయాలు మొద‌ల‌య్యాయి.

ఉత్తరప్రదేశ్ లో వచ్చేయేడాది అసెంబ్లి ఎన్నికలు జరగనున్న తరుణంలో యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ - ఆయన బాబాయి శివపాల్‌ యాదవ్‌ ల మధ్య ప్రత్యక్ష పోరు పతాక స్థాయికి చేరినట్టు చెబుతున్నారు. సమాజ్‌ వాదీ పార్టీపై పట్టు సాధించేందుకు సీఎం అఖిలేశ్‌ తీవ్రంగా ప్రయత్నిస్తుండగా.. ఆయనకు పార్టీ అధినేత - తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌ - శివపాల్‌ యాదవ్‌ ల నుంచి అంతేస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. శివపాల్‌ సింగ్‌ యాదవ్‌ సన్నిహితుడు దీపక్‌ సింఘాల్‌ ను యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించడంతో అఖిలేశ్‌ - శివపాల్‌ యాదవ్‌ ల మధ్య విభేధాలు మొదలయ్యారు. ఈ నేపథ్యంలోనే ములాయం తన కుమారుడిని ఎస్పీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి తమ్ముడు శివపాల్‌ కు పార్టీ పగ్గాలు అప్పజెప్పారు. తండ్రి తీసుకున్న నిర్ణయంతో రగిలిపోయిన అఖిలేశ్‌ బాబాయ్‌ శివపాల్‌ చేతిలోని కీలక శాఖలన్నిటినీ తొలగించారు. దీంతో వీరిద్దరి పంచాయితీ పెద్దాయన ములాయం ముందుకు చేరింది.

కాగా ములాయం మరో సోదరుడు అఖిలేష్ కు మద్దతు పలికారు. సోదరుడు - కన్న బిడ్డల మధ్య సమన్వయం కోసం ములాయం ప్రయత్నిస్తున్న వేళ - ఆయన ఇంకో సోదరుడు రాంగోపాల్ యాదవ్ - తాను అఖిలేష్ వైపేన‌ని ప్ర‌క‌టించారు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆయనను తప్పిస్తున్నట్టు అఖిలేష్ కు చెప్పకపోవడం భావ్యం కాదని వ్యాఖ్యానించారు. జరిగిన ఘటనలన్నీ చిన్న చిన్నవేనని - సమస్యలన్నీ సర్దుకుంటాయని రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్న రాంగోపాల్ యాదవ్ వ్యాఖ్యానించారు. సీఎంగా కొన్ని స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే హక్కు అఖిలేష్ కు ఉందని, వాటిని ఎవరూ ప్రశ్నించరాదని అన్నారు. మొత్తానికి ఒక బాబాయి అఖిలేశ్ కు దూర‌మ‌వుతున్నా మ‌రో బాబాయి మాత్రం అఖిలేశ్ కు అండ‌గా నిలుస్తుండ‌డంతో యూపీ రాజ‌కీయం రస‌వ‌త్తరంగా మారుతోంది.