Begin typing your search above and press return to search.

షీలా... అస‌లు రీజ‌న్ చెప్ప‌రుగా!

By:  Tupaki Desk   |   4 Jan 2017 12:47 PM GMT
షీలా... అస‌లు రీజ‌న్ చెప్ప‌రుగా!
X
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో నాట‌కీయ ప‌రిణామాలు శ‌ర‌వేగంగా చోటుచేసుకుంటున్నాయి. దేశంలోనే కీల‌క రాష్ట్రంగా ప‌రిగ‌ణిస్తున్న యూపీలో ఇప్ప‌టికే అధికార పార్టీలో నెల‌కొన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతుండ‌గా - గ్రాండ్ ఓల్డ్ పార్టీ ప్రాభ‌వం మ‌రింతగా దిగ‌జారే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఇక నేటి ఉద‌యం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ తో పాటు మ‌రో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్‌ ను ప్ర‌క‌టించిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మిగిలిన నాలుగు రాష్ట్రాల ఎన్నిక‌లు ఓ ఎత్తైతే... ఒక్క యూపీ ఎన్నిక‌లు మ‌రో ఎత్తుగానే భావిస్తున్నారు. యూపీలో అధికారం చేప‌డితే... కేంద్రంలో మ‌రోమారు పాగా వేయచ్చ‌ని కూడా బీజేపీ బ‌లంగా విశ్వ‌సిస్తోంది. ఈ క్ర‌మంలో మొన్న ఆ రాష్ట్ర రాజ‌ధాని ల‌క్నోలో బీజేపీ నిర్వ‌హించిన ప‌రివ‌ర్త‌న్ ర్యాలీకి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హాజ‌ర‌య్యారు. మోదీ వ‌స్తున్నార‌ని తెలుసుకున్న జనం తండోప‌తండాలుగా ర్యాలీకి త‌ర‌లివ‌చ్చారు. ఆ జ‌న సందోహాన్ని చూసిన మోదీ... ఇక విజ‌యం త‌మ‌దేన‌ని కూడా చెప్పేశారు.

అంతేకాదండోయ్‌... ఆ రాష్ట్రానికి చెందిన ఓ ప్ర‌ముఖ మీడియా సంస్థ చేయించిన స‌ర్వేలో బీజేపీకి 70 శాతం సీట్లు ద‌క్కుతాయ‌ని కూడా తేలింది. వెర‌సి కాంగ్రెస్ పార్టీ హ‌వా నామ‌మాత్ర‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది. అంటే యూపీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఓట‌మి ఖాయ‌మ‌మ‌న్న మాట‌. ఈ క్ర‌మంలో నేటి మ‌ద్యాహ్నం కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగేసిన ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌ - ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ మీడియా ముందుకు వ‌చ్చారు. ఎన్నిక‌ల న‌గారా మోగిన నేప‌థ్యంలో ఆమె మీడియా ముందుకు రావ‌డంతో ఆమె నోటి నుంచి కీల‌క ప్ర‌క‌ట‌న‌లే వ‌స్తాయ‌ని అంతా ఆశించారు. అయితే ఆమె అస‌లు విషయం చెప్ప‌కుండా... ఏవేవో చెప్పేసి వెళ్లిపోయారు. అయినా షీలా ఏం చెప్పారంటే... సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌ వాదీ పార్టీతో పొత్తుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమని ఆమె తెలిపారు. కాంగ్రెస్‌-ఎస్పీల మధ్య ఎన్నికల పొత్తు కుదిరితే.. పార్టీ సీఎం అభ్యర్థిగా తాను తప్పుకొనేందుకు సిద్ధమని కూడా ఆమె ప్ర‌క‌టించారు. హిందుత్వ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఎదుర్కొనేందుకు లౌకికవాద భావసారూప్యమున్న పార్టీలు ఏకం కావాల్సిన అవసరముందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే... కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ... ప్ర‌ధానిపై చేసిన సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు తిరిగి తిరిగి షీలా మెడ‌కే చుట్టుకున్నాయి. స‌హారా నుంచి ముడుపులు అందుకున్న వారి జాబితాలో షీలా పేరు కూడా బ‌య‌ట‌కొచ్చేసింది. ఈ క్ర‌మంలో షీలా నేతృత్వంలో యూపీ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే విష‌యం కాంగ్రెస్ పార్టీకి లాభించ‌ద‌ని తేలిపోయింది. అదే స‌మ‌యంలో ఒంట‌రిగా వెళ్లి ఏమీ చేయ‌లేమ‌ని నిర్ధారించుకున్న కాంగ్రెస్ పార్టీ... స‌మాజ్‌ వాదీ పార్టీతో పొత్తు కోసం చేయ‌ని య‌త్నం లేదంటే ఆశ్చ‌ర్యం లేదు. ఇలాంటి త‌రుణంలో అన్ని విష‌యాల‌ను ప‌క్క‌న‌పెట్టేసి... ఎస్పీతో పొత్తు కుదిరితే... సీఎం రేసు నుంచి త‌ప్పుకుంటాన‌ని షీలా ప్ర‌క‌టించ‌డం విడ్డూరంగానే ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది. అయినా... రాటుదేలిన మ‌న నేతాశ్రీల నుంచి ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు కాకుండా... అస‌లు విష‌యాల‌తో కూడిన ప్ర‌క‌ట‌న‌లు ఎప్పుడు వ‌చ్చాయి కాబ‌ట్టి. షీలా కూడా అదే ప‌నిచేశార‌న్న మ‌రో వాద‌న కూడా లేక‌పోలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/