Begin typing your search above and press return to search.

అట్ట‌ర్ ప్లాప్ అయిన అఖిలేష్‌- రాహుల్ దోస్తీ

By:  Tupaki Desk   |   11 March 2017 6:39 AM GMT
అట్ట‌ర్ ప్లాప్ అయిన అఖిలేష్‌- రాహుల్ దోస్తీ
X
ఉత్త‌రప్ర‌దేశ్ వేదిక‌గా కాంగ్రెస్ వేసిన పాచిక అట్ట‌ర్ ప్లాప్ అయింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్య‌క్షుడు - ఆ పార్టీ భ‌విష్య‌త్ నాయ‌కుడు రాహుల్ గాంధీ - సమాజ్ వాదీ నాయ‌కుడు అఖిలేష్ యాద‌వ్ వేసిన ఎత్తుగ‌డ‌ను ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారు. 403 సీట్లు ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో ప్ర‌స్తుతం బీజేపీ పార్టీ 360 సీట్ల ఆధిక్యంలో కొన‌సాగుతోంది. దీంతో అఖిలేశ్‌-రాహుల్ దోస్తీని యూపీ ప్ర‌జ‌లు తిర‌స్క‌రించిన‌ట్ల‌యింది. మ‌రో వైపు మాయావ‌తి నేతృత్వంలోని బీఎస్పీ పార్టీ కూడా బోల్తా కొట్టింది.

బీజేపీ సుమారు 200 నియోజ‌క‌వ‌ర్గాల్లో లీడింగ్‌ లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు 31 స్థానాల్లో లీడింగ్‌ లో ఉండ‌గా, బీఎస్పీ 31 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. దాదాపు 14 ఏళ్లుగా యూపీలో బీజేపీ ప్ర‌భుత్వం లేదు. 2014లో జ‌రిగిన లోక్‌ స‌భ ఎన్నిక‌ల్లోనూ బీజేపీ నేతృత్వంలోని కూట‌మి 80 స్థానాల‌కు గాను 73 స్థానాల‌ను గెలుచుకుంది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ప్ర‌భంజ‌నం వ‌ల్లే గ‌త లోక్‌ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ పార్టీ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈ సారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ మోడీ ప్ర‌భంజ‌నం క‌నిపించింది. బ‌హిరంగ‌స‌భ‌లు - రోడ్ షోలతో ప్ర‌చారాన్ని నిర్వ‌హించిన మోడీ యూపీలో అఖిలేశ్‌-రాహుల్ జోరుకు బ్రేకేశారు. గ‌త రెండు అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ రాష్ట్ర ప్ర‌జ‌లు ప్ర‌తిసారి ఒకే పార్టీకి మెజారిటీని క‌ట్ట‌బెట్టారు. 2012లో ఎస్పీ 224 సీట్లు గెల‌వ‌గా, బీఎస్పీ 80, బీజేపీ 47 సీట్లు గెలుచుకున్నాయి.

కాగా, యూపీలో సమాజ్‌ వాదీ పార్టీ ఘోర పరాభవం చవిచూస్తోంది. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణ యాదవ్ లక్నో కంటోన్మెంట్ నుంచి పోటీ చేశారు. ఈవిడ వెనుకంజలో ఉన్నారు. అపర్ణపై బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ బరిలోకి దిగారు. రీటా బహుగుణ ఆధిక్యంలో ఉన్నారు. 2012లో కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన రీటా గెలుపొందారు. 2017 ఎన్నికల కంటే ముందు రీటా బహుగుణ బీజేపీలో చేరి ఎన్నికల బరిలో దిగారు. వరుసగా రెండోసారి రీటా విజయం సాధించబోతున్నది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/