Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రంలో మాజీ సీఎంల‌కు ఇళ్ల త‌ల‌నొప్పి

By:  Tupaki Desk   |   22 May 2018 4:24 AM GMT
ఆ రాష్ట్రంలో మాజీ సీఎంల‌కు ఇళ్ల త‌ల‌నొప్పి
X
అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌భుత్వ ప‌రంగా వ‌స‌తులు.. సౌక‌ర్యాలు అందుబాటులో ఉంటాయి. ప‌వ‌ర్ పోయినంత‌నే వాటిని పొందే వీలుండ‌దు. కొన్ని సేవ‌ల‌కు అవ‌కాశం ఉన్నా.. ప్ర‌భుత్వ‌ప‌రంగా వ‌చ్చిన ఇళ్ల‌ను ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే.. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి పోయినా ప్ర‌భుత్వ బంగ్లాల‌ను ఖాళీ చేయ‌టానికి స‌సేమిరా అంటున్నారు యూపీ మాజీ ముఖ్య‌మంత్రులు.

ఓవైపు సుప్రీంకోర్టు మొట్టికాయ‌లు వేసినా.. వారి తీరు మార‌క‌పోవ‌టం ఆస‌క్తిక‌క‌రంగా మారింది. ముఖ్య‌మంత్రులుగా ఉన్న‌ప్పుడు ప్ర‌భుత్వ‌ప‌రంగా కేటాయించే ఇళ్ల‌ను.. సీఎం ప‌ద‌వి పోయిన త‌ర్వాత కూడా వ‌దిలిపెట్టేందుకు స‌సేమిరా అంటున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రులు అఖిలేశ్ యాద‌వ్‌.. మాయ‌వ‌తులు ప్ర‌భుత్వ బంగ్లాల‌ను ఖాళీ చేయ‌టానికి సిద్ధంగా లేరు. బంగ్లాల‌ను ఖాళీ చేయాల‌న్న కోర్టు తాఖీదుల‌పై వారు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. బంగ్లాను ఎందుకు ఖాళీ చేయ‌లేద‌న్న ప్ర‌శ్న‌ను మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేశ్ యాద‌వ్ ను ప్ర‌శ్నిస్తే.. తాను ఉండ‌టానికి వేరే ఇల్లు లేద‌ని.. త‌న కుటుంబ అవ‌స‌రాలు.. భ‌ద్ర‌త దృష్ట్యా తాను వేరే ఇంటిని కొనుక్కునేందుకు టైం కావాల‌ని కోరుతున్నారు.

ఇంత‌కీ ఆయ‌న ఇల్లు కొనుక్కోవ‌టానికి కోర్టును అడిగిన టైం ఎంతో తెలుసా? అక్ష‌రాల రెండు సంవ‌త్స‌రాలు. ఒక మాజీ ముఖ్య‌మంత్రికి అనువైన ఇంటిని ఎంచుకోవ‌టానికి రెండేళ్లు కావాలా? అంటే.. అవున‌ని చెబుతున‌నారు. ఇదే విష‌యాన్ని నోటి మాట‌గా కాదు.. రాత‌పూర్వ‌కంగా రాసి ఇస్తున్నారు.

ల‌క్నోలో త‌మ నాయ‌కుడు అఖిలేశ్ యాద‌వ్ కు ఇళ్లు ఇచ్చేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నార‌ని.. కానీ కొన్ని ప్రోటోకాల్స్ పాటించాల్సి ఉండ‌టం.. భ‌ద్ర‌త‌కు సంబంధించిన అంశాలు ఉండ‌టంతో ఇల్లు ఎంపిక చేసుకోవ‌టం ఆల‌స్య‌మ‌వుతుంద‌ని ఎస్పీ నేత ఒక‌రు చెబుతున్నారు. అఖిలేశ్ వ్య‌వ‌హారం ఇలా ఉంటే.. ఆ రాష్ట్రానికి సీఎంగా అప్పుడెప్పుడో వ్య‌వ‌హ‌రించిన మాయావ‌తి ముచ్చ‌ట మ‌రోలా ఉంది.

కోట్లాది రూపాయిలు విలువ చేసే ఇంట్లో ఉన్న మ‌రో మాజీ ముఖ్య‌మంత్రి మాయావ‌తి తన‌కు ప్ర‌భుత్వం త‌ర‌ఫున కేటాయించిన ఇంటిని వ‌దులుకోవ‌టానికి సిద్ధంగా లేరు. కాన్షీ రామ్ పేరుతో ఉన్న బంగ్లాను ఖాళీ చేయ‌టానికి సుముఖంగా లేరు. ఆమె ఇంటిని ఖాళీ చేస్తే..కాన్షీ రామ్ మెమోరియ‌ల్ ట్ర‌స్టుగా మార్చే వీలుంది. అందుకే.. ఆమె ఆ ఇంటిని త‌న‌తోనే ఉంచుకోవాల‌ని భావిస్తున్నారు. ఇలా.. యూపీ మాజీ ముఖ్య‌మంత్రులు ప్ర‌భుత్వ భ‌వ‌నాల్ని విడిచి పెట్టేందుకు స‌సేమిరా అంటున్నారు. మ‌రోవైపు.. వీరిని ఖాళీ చేయించాల‌ని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేప‌థ్యంలో.. ఈ వ్య‌వ‌హారం అధికారిక వర్గాల‌కు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా మారిన‌ట్లు చెబుతున్నారు.