Begin typing your search above and press return to search.

కిడ్నాప్ కేసులో అఖిలప్రియనే సూత్రధారి.. సాక్ష్యాలు చూపిన సీపీ

By:  Tupaki Desk   |   11 Jan 2021 4:43 PM IST
కిడ్నాప్ కేసులో అఖిలప్రియనే సూత్రధారి.. సాక్ష్యాలు చూపిన సీపీ
X
సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో అఖిలప్రియకు ఉచ్చు బిగిసింది. ఆమెనే ఈ కేసులో అసలు సూత్రధారి అని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆధారాలను బయటపెట్టాడు. ఈరోజు హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీపీ అఖిలప్రియను ఏ1 నిందితురాలిగా ఎందుకు చేర్చామో ఆధారాలతో సహా వివరించారు.

ఈ కిడ్నాప్ కేసులో నిందితులు మల్లికార్జున్ రెడ్డి, మాదాల శ్రీనులు కీలక పాత్రదారులు అని.. వీరి పేర్లతోనే కొత్త సిమ్ కార్డులు కొన్నారని సీపీ వివరించారు. ఈ సిమ్ నంబర్ ను అఖిలప్రియ కూడా ఉపయోగించారని సీపీ వెల్లడించారు.

అఖిలప్రియ అనుచరుడు సంపత్ కుమార్ ను అరెస్ట్ చేశామని.. కిడ్నాప్ కు ముందు నిందితులు బోయినపల్లిలో రెక్కీ నిర్వహించారని సీపీ వెల్లడించారు. అఖిలప్రియ సూచన మేరకే ప్రవీణ్ రావు ఇంటి వద్ద నిందితులు రెక్కీ నిర్వహించారని సీపీ తెలిపారు.

ఈ మొత్తం కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని సీపీ అంజనీకుమార్ తెలిపారు. నిందితుల మధ్య జరిగిన ఫోన్ సంభాషనను సీపీ మ్యాప్ ద్వారా చూపించారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేశామని.. నిందితులు వాడిన సెల్ ఫోన్లు, వాహనాల నకిలీ నంబర్ ప్లేట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.

ప్రస్తుతం ఈ కిడ్నాప్ కేసులో అఖిలప్రియ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆమె బెయిల్ ను కోర్టు తాజాగా తిరస్కరించి పోలీసుల కస్టడీకి అప్పగించింది. అఖిలప్రియ సోదరుడు, చెల్లెలు ఆరోపణల నేపథ్యంలోనే సీపీ బయటకు వచ్చి ఈ నిజాలు వెల్లడించినట్లు సమాచారం.