Begin typing your search above and press return to search.

ఇప్పుడున్న పంచాయితీలు సరిపోవా? మళ్లీ ఇదెక్కడి రచ్చ అఖిలమ్మ?

By:  Tupaki Desk   |   11 Aug 2021 3:30 PM GMT
ఇప్పుడున్న పంచాయితీలు సరిపోవా? మళ్లీ ఇదెక్కడి రచ్చ అఖిలమ్మ?
X
చిన్న వయసులో మంత్రి పదవి వెతుక్కుంటూ రావటం అందరు రాజకీయ నేతలకు సాధ్యమయ్యేది కాదు. దీనికి తోడు 'భూమా ఫ్యామిలీ' అన్న బరువైన బ్యాగేజ్ ఉన్నప్పుడు.. మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అనూహ్యంగా చోటు చేసుకున్న తల్లి మరణంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటమే కాదు.. ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా గెలిచిన అఖిలప్రియకు చంద్రబాబు ప్రభుత్వం మంత్రిపదవి ఇవ్వటం తెలిసిందే.

తల్లిదండ్రులకున్న లౌక్యం..రాజకీయ ఎత్తుగడలు భూమా కుటుంబంలోని మరెవరికీ రాలేదన్న మాటకు తగ్గట్లే భూమా అఖిలప్రియ అడుగులు పడుతున్నాయని చెప్పాలి. తన తండ్రికి సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డిని దూరం చేసుకోవటంలోనే అఖిలప్రియ తెలివి ఎంతన్న విషయం ఇట్టే అర్థమవుతుందన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది.

ఈ మాటకు తగ్గట్లే 2019లోజరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవటం తెలిసిందే. పదవి చేతిలో లేనప్పుడు.. తానుప్రాతినిధ్యం వహించే పార్టీ గడ్డు పరిస్తితుల్లో ఉన్న వేళ.. తొందరపాటు చర్యలకు దిగరు. అయినప్పటికీ అందుకు భిన్నంగా వ్యవహరించి.. ఆ మధ్యన కిడ్నాప్ లాంటి సీరియస్ క్రైంలో ఆమె పేరు మారుమోగింది. అంతేకాదు.. ఆమె భర్త కోర్టు విచారణను తప్పించుకునేందుకు తప్పుడు కొవిడ్ సర్టిఫికేట్లను సమర్పించి పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయిన వైనాన్ని చూసినోళ్లంతా విస్మయానికి గురయ్యే పరిస్థితి.

తెలంగాణలో భూకబ్జా.. కిడ్నాప్ వ్యవహారంలో ఆమెతో పాటు.. ఆమె భర్త.. సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి పేర్లు బలంగా వినిపించటం.. వారంతా కొద్దిరోజుల పాటు పరారీలో ఉండటం తెలిసందే. తాజాగా ఆమె కేపీహెచ్ బీపరిధిలోని లోథా అపార్ట్ మెంట్ లోని తన ఫ్లాట్ లోకి కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో బోయిన్ పల్లి పోలీసులు అనధికారికంగా చొరబడి విలువైన ఆస్తిపత్రాలు.. విలువైన డాక్యుమెంట్లు తీసుకెళ్లినట్లుగా ఆమె తాజాగా పోలీసులకు ఫిర్యాదు ఇవ్వటాన్ని తెలుసుకున్న వారంతా ముక్కున వేలేసుకున్నారు.

అఖిలప్రియలో మొండితనం కంటే మూర్ఖత్వమే ఎక్కువగా ఉందన్నట్లుగా ఆమె తీరు ఉందని చెబుతున్నారు. హఫీజ్ పేట భూముల వ్యవహారంలో ఆమె.. ఆమె భర్త భార్గవ్ రామ్.. తమ్ముడికి బోయిన్ పల్లి పోలీసులు ఉచ్చు బిగించటం.. ఆ ఎపిసోడ్ లో ఆమె జైలుకు వెళ్లి రావటం తెలిసిందే. ఇలాంటివేళ.. కేపీహెచ్ బీ పోలీసులకు బోయిన్ పల్లి పోలీసుల మీద ఫిర్యాదు ఇవ్వటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తనకున్న ప్రైవేటు పంచాయితీని.. పోలీసుల మీదకు గురి పెట్టటం వల్ల ఒరిగే ప్రయోజనం కంటే కూడా డ్యామేజే ఎక్కువన్న మాట వినిపిస్తోంది. తాజాగా తెలంగాణ పోలీసులపై అఖిలప్రియ ఫిర్యాదు చేయటాన్ని తెలంగాణ ప్రభుత్వం సైతం సీరియస్ గా తీసుకున్నట్లు చెబుతున్నారు. పోలీసు బాసులు సైతం మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా చూస్తున్న వారు.. పోలీసుల మీదనే ఫిర్యాదు చేయాలనే అద్భుతమైన ఐడియా అఖిలప్రియకు ఎవరిచ్చారన్న ప్రశ్నను సంధిస్తున్నారు. అఖిలప్రియ ఎత్తులు ఎవరికి అర్థం కాని రీతిలో ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.