Begin typing your search above and press return to search.

అఖిల‌ప్రియ ఇలా ఎలా మాట్లాడ‌తావ‌మ్మ‌?

By:  Tupaki Desk   |   27 Jun 2018 3:35 AM GMT
అఖిల‌ప్రియ ఇలా ఎలా మాట్లాడ‌తావ‌మ్మ‌?
X
తెలుగుదేశం పార్టీ నేత‌లు ఒక‌రిని మించి ఒక‌రు చేస్తున్న కామెంట్లు ఆశ్చ‌ర్యాన్ని, అయోమ‌యాన్ని క‌లిగిస్తున్నాయ‌ని అంటున్నారు. పార్టీ నేత‌లు ఒక‌వైపు, ప్ర‌జాప్ర‌తినిధులుగా గెలిచిన నాయ‌కులు మ‌రోవైపు అన్న‌ట్లుగా చేస్తున్న వ్యాఖ్య‌లు ప్ర‌జ‌ల‌కు అనూహ్య‌మైన కామెడీని పంచుతున్నాయ‌ని పేర్కొంటున్నారు. తాజాగా ఏపీ మంత్రి అఖిలప్రియ చేసిన వ్యాఖ్య‌లు ఇలాంటి అయోమ‌యం, అతి క‌వ‌రింగ్‌తో న‌వ్వుల పాలు చేస్తున్నార‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదంతా ఏపీకి ద‌క్కాల్సిన ప్ర‌యోజ‌నాలు, ఇందులో జ‌న‌సేన అధ్యక్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాత్ర గురించి.

క‌డ‌ప ఉక్కు ఫ్యాక్ట‌రీ గురించి ప్ర‌భుత్వం ఏర్ప‌డి, కేంద్రంలో మంత్రి ప‌ద‌వులు అనుభ‌వించిన నాలుగేళ్ల త‌ర్వాత హ‌ఠాత్తుగా టీడీపీకి ఇటీవ‌లే గుర్తుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో లేడికి లేచిందే ప‌రుగు అన్న‌ట్లుగా ఆ పార్టీ ఎంపీ సీఎం ర‌మేశ్ దీక్ష‌కు దిగారు. స‌ద‌రు దీక్ష‌కు టీడీపీ నాయ‌కులు పొలోమంటూ వెళ్లి మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. త‌మదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఏపీ మంత్రి అఖిల‌ప్రియ సీఎం ర‌మేశ్ దీక్షా శిబిరాన్ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌కు రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ప‌ట్ట‌డం లేద‌న్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి పోటీ చేయ‌డం వ‌ల్ల తాము న‌ష్ట‌పోయామంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పొత్తు లేక‌పోతే ఇంకా ఎక్కువ సీట్లు వ‌చ్చేవ‌ని అన్నారు.

అయితే అఖిల‌ప్రియ ఇలాంటి కామెంట్లు చేయ‌డం చిత్రంగా ఉంద‌ని ప‌లువ‌రు అంటున్నారు. వాస్త‌వంగా గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌ను క‌లిసి బ‌తిమాలి ఆయ‌న మ‌ద్ద‌తును టీడీపీ పెద్ద‌లు కోరారనేది రాజ‌కీయాల గురించి ఓన‌మాలు తెలిసిన వార‌యినా చెప్పే మాట‌. అలాంటిది ప‌వ‌న్ త‌మ‌కు మ‌ద్ద‌తిచ్చాడ‌ని ఇప్పుడు నిందలు వేయ‌డం టీడీపీ నేత‌ల‌కే చెల్లింద‌ని ప‌లువురు అంటున్నారు. దీంతో పాటుగా త‌మకు సీట్లు న‌ష్టం జ‌రిగింద‌ని అఖిల‌ప్రియ ఇప్పుడు అంటుండ‌టం మ‌రింత చిత్ర‌మ‌ని పేర్కొంటున్నారు. ఎందుకంటే..అఖిల‌ప్రియ గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీలోనే లేరు. అలాంటి నేప‌థ్యంలోఅఖిల‌ప్రియ మాట‌లు హాస్యాస్ప‌దం కాక మ‌రేమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. వీట‌న్నింటికి తోడుగా ప‌వ‌న్ మ‌ద్ద‌తు అంశాన్ని గ‌త నాలుగేళ్లుగా ప్ర‌స్తావించ‌ని టీడీపీ నేత‌లు ఇప్పుడు ఆయ‌న ప్ర‌స్తావ‌న తేవ‌డం ప‌వ‌న్ పార్టీ రాజ‌కీయానికి ప‌రాకాష్ట అని పేర్కొంటున్నారు.