Begin typing your search above and press return to search.

అఖిలప్రియపై తమ్ముడి కేసు.. ట్విస్ట్ ఇదే

By:  Tupaki Desk   |   22 Nov 2019 7:46 AM GMT
అఖిలప్రియపై తమ్ముడి కేసు.. ట్విస్ట్ ఇదే
X
భూమా ఫ్యామిలీ.. రాజకీయంగా ఎంతో పేరు, ప్రఖ్యాతలు, పలుకుబడి, డబ్బు గల కుటుంబం అదీ.. భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా, ఆయన భార్య , కూతురు మంత్రిగా చేశారు. అస్సలు ఆర్థిక ఇబ్బందులకు ఆస్కారమే లేదు. కానీ తాజాగా మాజీ మంత్రి, టీడీపీ నేత అయిన భూమా అఖిలప్రియపై ఆమె తమ్ముడు కోర్టుకెక్కాడు. ఓ 2 కోట్ల స్థలంలో తనకూ వాటా ఉందని రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటీషన్ వేశారు. సొంత తమ్ముడే అక్కపై ఇలా ఫిర్యాదు చేయడమేంటి అన్న సందేహాలు అందరికీ వచ్చాయి.. తరిచి చూస్తే దీనివెనుక పెద్ద కథ ఉందన్న ప్రచారం తెరపైకి వస్తోంది.

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత అఖిల ప్రియపై ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటీషన్ నమోదు చేశాడు. హైదరాబాద్ శివారుల్లోని భూమిలో తనకు వాటా కావాలని అఖిల ప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కేసు దాఖలు చేశారు. రాజేంద్రనగర్ మండలం గండిపేట గ్రామంలో 190,192 సర్వే నంబర్లలో భూమా నాగిరెడ్డికి సుమారు 1000 గజాల భూమిని 2016లో విక్రయించారు. సుమారు 2 కోట్లకు అమ్మారు. అయితే అప్పుడు మైనర్ అయిన జగన్ విఖ్యాత్ రెడ్డి ఇప్పుడు తనకు మైనార్టీ తీరిందని.. ఆ భూమి విక్రయంలో వచ్చిన డబ్బులో తనకూ వాటా కావాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి భూమా అఖిలప్రియకు, ఆమె తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డికి ఎలాంటి వివాదాలు లేవంటారు. అయినా అక్కపై ఎందుకు కోర్టుకెక్కాడనే విషయంలో పలు సందేహాలు తెరపైకి వస్తున్నాయి.

ఆఫ్ ది రికార్డ్ మాట ఏంటంటే భూమా అఖిల ప్రియ ప్రోద్బలంతోనే ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ఈ ఖరీదైన భూమిపై కోర్టుకెక్కినట్లు సమాచారం. ఆ భూమి రేటు బాగా పెరగడం.. తక్కువకే అమ్మామని.. మరింత డబ్బు గుంజడానికే అఖిలప్రియ, ఆమె తమ్ముడు ఇలా నాటకాలాడుతున్నారని ఆ భూమిని కొన్నవారు ఆరోపిస్తున్నారు.

భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కూడా ఆళ్లగడ్డలో ఓ క్రషర్ పార్టనర్ షిప్ విషయంలో తన పార్ట్ నర్ ను బెదిరించి హత్యాయత్నం చేసి కేసుల్లో ఇరుకున్నారు. ఆ క్రషర్ ను తనకు రాసివ్వాలని అఖిలప్రియ భర్త బెదిరించినట్టు బాధితుడు కేసు పెట్టాడు. దీని తెరవెనుక అఖిలప్రియనే ఉందని ఆరోపించాడు.

ఇప్పుడు మరో ఖరీదైన భూమి విషయంలో అఖిలప్రియ కొనుగోలుదారులను ఇబ్బంది పెట్టాలనే తన తమ్ముడితో ఈ పిటీషన్ వేసి ఉంటుందని కొన్న భూమి హక్కుదారులు ఆరోపిస్తున్నారు. ఇలా లిటేగేషన్లు పెట్టే అఖిలప్రియ తన పేరు, పరపతి చెడగొట్టుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు.లేని పోని వివాదాలు తెచ్చుకుంటూ రాజకీయంగా అఖిలప్రియ అభాసుపాలువుతున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది