Begin typing your search above and press return to search.

వైఎస్ మాదిరి చేయలేకపోయారే?

By:  Tupaki Desk   |   29 Sept 2015 3:38 PM IST
వైఎస్ మాదిరి చేయలేకపోయారే?
X
తిరిగి రాని లోకాలకు వెళ్లిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తలుచుకోలేకుండా ఉండలేకపోతున్నారు నేతలు. రాష్ట్ర విభజన జరిగిపోయి.. సీమాంధ్ర వాసన ఏ మాత్రం వేసిన.. చిరాకు పడిపోవటమే కాదు.. శివాలెత్తే తెలంగాణ అధికార పక్షానికి.. అదే సీమాంధ్ర నేత షాక్ తగిలింది.

తమ కంటే మొనగాళ్లు లేరన్నట్లుగా మాటలు చెప్పే తెలంగాణ అధికారపక్షానికి దిమ్మ తిరిగి. మైండ్ బ్లాక్ అయిపోయే వ్యాఖ్యలు చేశారు మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ. తనకున్న వాగ్థాటితో ఎలాంటి వారి నోటికైనా తాళం వేయగలిగిన సత్తా ఉన్న అక్బరుద్దీన్ రైతుల ఆత్మహత్యలపై మాట్లాడిన సందర్భంగా.. దివంగత నేత వైఎస్ ప్రస్తావనను తెలంగాణ అసెంబ్లీకి తీసుకురావటమే కాదు.. ఆ మహా నేత సాటి కూడా మీరే చేయలేకపోయారే అన్న అర్థం వచ్చేలా మాట్లాడేసి డిఫెన్స్ లో పడేశారు.

తమది ధనిక రాష్ట్రమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పుకునే మాటల్నే ఉపయోగించి.. ఆత్మరక్షణలో పడేశారు. ధనిక రాష్ట్రమని చెప్పుకునే రాష్ట్రంలో రైతుల రుణాలు వాయిదాల పద్దతిలో మాపీ చేయటం ఏమిటని.. దివంగత నేత వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కనుక ఒక్క కలంపోటుతో తీసి పారేసిన వైనాన్ని ఎందుకు అమలు చేయటం లేదని సూటిగా ప్రశ్నించారు. రుణమాఫీని ప్రకటించిన కేసీఆర్ సర్కారు వాయిదాల పద్ధతిలో మాఫీ చేయటం ఏమిటంటూ ప్రశ్నిస్తూ.. వైఎస్ ను పొగిడేశారు. ధనిక రాష్ట్రమని బీరాలు పలికే కేసీఆర్ సర్కారు చేయలేని పనిని.. ఒక సీమాంధ్ర ముఖ్యమంత్రి చేశారన్న మాటను ఆయన చెప్పకనే చెప్పినట్లైంది.