Begin typing your search above and press return to search.

ఏకే 47లు అద్దెకు ఇవ్వబడును!

By:  Tupaki Desk   |   15 Aug 2016 4:17 AM GMT
ఏకే 47లు అద్దెకు ఇవ్వబడును!
X
గతంలో సైకిల్లు అద్దెకు ఇచ్చేవారు.. ఆ సైకిల్ తీసుకుని ఆ వ్యక్తే తొక్కుకుంటూ వెళ్లి పని పూర్తిచేసుకుని తిరిగి వచ్చి సొమ్ము చెల్లించి సైకిల్ అప్పగించి, అడ్వాన్స్ అమౌంట్ వెనక్కి తీసుకునేవారు. తర్వాతి కాలంలో కార్లు అద్దెకు ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ డ్రైవింగ్ బైక్ లు - కార్లు అద్దెకు ఇవ్వడం సిటీల్లో బాగానే పాపులర్ అయ్యింది. అవంటే వాహనాలు.. అత్యవసర పరిస్థితుల్లోనో, వారాంతంలో ఏ షికారుకోసమో తీసుకున్నారంటే అర్ధముంది కానీ.. తాజాగా ఏకే 47లు అద్దెకు ఇచ్చే బిజినెస్ ఒకటి వెలుగు చూసింది. అది ఏ ఇతరదేశాల్లోనో అయితే పెద్ద ఆశ్చర్యపోనక్కరలేదు కానీ.. మన దేశంలోనే ఈ రకం దుకాణం వెలవడం ఆశ్చర్యమే కాదు ఆందోళన కలిగించే విషయంగానే చెప్పాలి.

ఇప్పటికే రోజుకో రకం నేరంతో మీడియాలో నానుతున్న ఉత్తరప్రదేశ్‌ లో లో ఈ కొత్త బిజినెస్ స్టార్ట్ అయ్యిందంట. ఈ ప్రాంతంలో చిన్న చిన్న తుపాకుల దగ్గరనుండి ఏకే 47 లాంటి ఆధునిక ఆయుధాల వరకూ అమ్మకానికే పెట్టారట. అలాంటి ఆయుదాలు కొనుక్కొని ఇంట్లో దాచుకోవడం ఎందుకు అనుకునేవారికోసం.. వారి వారి పని పూర్తిచేసుకునే వరకూ అన్నట్లు.. అద్దెకు కూడా లభిస్తున్నాయట. స్థానిక బీజేపీ నేత బ్రిజ్‌ పాల్ తియోతియా హత్య కేసును విచారిస్తున్న పోలీసులకు ఈ విషయం తెలిసింది. అద్దెకు ఆయుదాలు.. పైగా అవి ఏకే 47వంటి ఆయుదాలు దొరకడంపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇలా అద్దెకిచ్చే ఒక్కో ఏకే 47కు ముందుగా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు డిపాజిట్ చెల్లించాలి. ఇలా అద్దెకు తీసుకున్న తుపాకీని సదరు వ్యక్తి తన పని పూర్తిచేసుకుని తిరిగి ఆ వ్యాపారికి ఇచ్చేటప్పుడు అతడు రూ.50 వేల నుంచి 60 వేల వరకు మినహాయించుకుని డిపాజిట్‌ ను తిరిగి ఇచ్చేస్తాడు. ఒకవేళ తుపాకీని పోయిందని చెబితే.. ఆ డిపాజిట్ తిరిగివ్వరు. ఢిల్లీ సరిహద్దుల్లోని ఉత్తర ప్రదేశ్ ప్రాంతంలో కొన్ని గ్యాంగ్‌ లు ఇలా ఆయుధాలను అద్దెకిస్తుంటారట. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషయంపై ప్రజలూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు!