Begin typing your search above and press return to search.

ట్విట్ వార్ కి తెరతీసిన అజిత్, శరద్ పవార్ !

By:  Tupaki Desk   |   25 Nov 2019 7:56 AM GMT
ట్విట్ వార్ కి తెరతీసిన అజిత్, శరద్ పవార్ !
X
మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా అంచనా వేయడం కూడా చాలా కష్టంగా ఉంది. మొన్నటివరకు ఎన్సీపీ , కాంగ్రెస్ తో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనుకుంటే .. ఒక్క రాత్రిలో ఈ సీన్ మొత్తం మారిపోయింది. బీజేపీ పన్నిన వ్యూహానికి శివసేనకి కోలుకోలేని షాక్ తగిలింది. ఈ మహా ఎపిసోడ్ కి ముఖ్య కారకుడు ...ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్. అజిత్ పవార్ చేసిన పనికి శివసేన కి , ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కి కూడా దిమ్మతిరిగిపోయింది. ఇంకా ఆ షాక్ లో నుండి కోలుకోకముందే అజిత్ మరో షాక్ ఇచ్చారు.

తాజాగా అజిత్ పవార్ ..తాను ఇప్పటికీ ఎన్సీపీలోనే ఉన్నానని, ఎల్లప్పటికీ తమ నాయకుడు శరద్ పవారేనంటూ అజిత్ ట్విట్టర్ లో వెల్లడించారు. అంతేకాదు, మహారాష్ట్రలో వచ్చే ఐదేళ్లపాటు తాము బీజేపీ-ఎన్సీపీ కూటమి ప్రజారంజక పాలన సాగిస్తుంది అంటూ ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒకపక్క అజిత్ పవార్ చేసిన పనికి శాసనసభా పక్ష నేతగా ఆయనను తొలగిస్తూ ఎన్సీపీ నిర్ణయం తీసుకుంది. అలాగే అజిత్ పవార్ ను ఎన్సీపీలోనే కొనసాగాలని కోరి మంతనాలు జరిపినట్టు సమాచారం . ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా అజిత్ పవార్ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఒకవైపు అజిత్ పవార్ ను డిప్యూటీ సీఎంగా రాజీనామా చేసి ఎన్సీపీ లోకి రావాలని ఎన్సీపీ ఒత్తిడి చేస్తున్న సమయంలో అజిత్ పవార్ చేసిన ఈ ట్విట్ ఇప్పుడు అందరిని అయోమయానికి గురిచేస్తోంది. ఇక అజిత్ పవార్ తాజా ట్వీట్ పై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తనదైన శైలిలో స్పందించారు. అజిత్ పవార్ చేసిన ట్వీట్ కు శరత్ పవార్ కౌంటర్ ఇచ్చారు. ఎట్టిపరిస్థితుల్లో బీజేపీతో కలిసి ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రశ్నే లేదని ఆయన ట్విట్టర్ వేదికగా మరోసారి స్పష్టం చేసారు. ఎన్సీపీ , కాంగ్రెస్ శివసేన లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. అజిత్ పవార్ స్టేట్మెంట్ తప్పు స్టేట్మెంట్ అని , కేవలం అందరిని సందిగ్ధానికి గురిచేసి,మిస్ గైడ్ చేసే ప్రయత్నంలో భాగంగానే అజిత్ పవార్ ట్వీట్ చేశారని ఆయన ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు.