Begin typing your search above and press return to search.

మన జేమ్స్ బాండే ఎటాక్ స్కెచ్ గీశారా?

By:  Tupaki Desk   |   30 Sept 2016 12:52 PM IST
మన జేమ్స్ బాండే ఎటాక్ స్కెచ్ గీశారా?
X
హాలీవుడ్ సినిమాల్లో ఎంతమంది హీరోలు ఉన్నా.. జేమ్స్ బాండ్ ఇమేజ్‌కు ఓ ప్ర‌త్యేక‌త ఉంది. ప్రపంచాన్ని రక్షించటంతో పాటు.. తన దేశానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చూసుకునేందుకు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్లి.. విలన్ల భరతం పెట్టే బాండ్ కు ఉన్న ఇమేజే వేరు. సినిమాల్లో చూపించినంత కాకున్నా.. రియల్ లైఫ్ లో ఉండే పరిమితుల నేపథ్యంలో ఇండియన్ జేమ్స్ బాండ్ గా అజిత్ దోవల్ ను అభివర్ణిస్తుంటారు. ఎవరాయన? ఆయన గొప్పతనం ఏమిటి? ఎందుకాయనను ఇండియన్ జేమ్స్ బాండ్ గా అభివర్ణిస్తుంటారు? లాంటి విషయాల్లోకి వెళితే..

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోడీ ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని ఏరికోరి మరీ తీసుకొచ్చి జాతీయ భద్రతా సలహాదారుగా నియమించుకున్నారు. ఇంతకీ ఆయన ఎవరో కాదు.. అజిత్ దోవల్. ఇదొక్కటి చాలు ఆయన సత్తా ఏమిటో అర్థం చేసుకోవటానికి. గూఢచర్య వ్యవహారాల్లో మంచి పట్టు ఉండటమే కాదు.. విషయం మూడో కంటికి తెలీకుండా పని చక్కబెట్టుకు రావటంలో ఆయన మహా నేర్పరి. తాజాగా పాక్ మీద భారత్ జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ వెనుక మాస్టర్ ప్లాన్ అంతా ఆయనదే.

ఉత్తరాఖండ్ లోని పౌరీ గర్వాల్ లో స్వాతంత్య్రానికి పూర్వం (1945లో) బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆయన తండ్రి సైన్యంలో పని చేశారు. 1968 బ్యాచ్ ఐపీఎస్ గా విధుల్లో చేరిన‌ ఆయన తనదైన శైలిలో ఎన్నో విపత్కర పరిస్థితుల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించారు. మిజోరం.. పంజాబ్ లో చొరబాట్లపై ఉక్కుపాదం మోపటమే కాదు.. పంజాబ్ స్వ‌ర్ణ దేవాలయంలో ఆపరేషన్ బ్లూస్టార్ జరిగినప్పుడు పాక్ గూఢచారిగా నటించి.. ఉగ్రవాదుల కీలక సమాచారాన్ని తీసుకొచ్చిన నైపుణ్యం ఆయన సొంతం.

కీర్తిచక్ర పురస్కారం పొందిన ఒక ఐపీఎస్ అధికారి ఎవరైనా ఉన్నారంటే దోవ‌ల్‌ పేరు మాత్రమే కనిపిస్తుంది. సహజంగా ఈ అవార్డును సైనికులకు ఇస్తుంటారు. అలాంటిది ఐపీఎస్ అధికారిగా ఆయన అందుకోవటం అంటేనే.. ఆయన పని తీరు ఎలాంటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సిక్కింను దేశంలో విలీనం చేయటంలో కీలక భూమిక పోషించిన దోవల్.. ఇస్లామాబాద్ లో భారత హైకమిషనర్ గా ఆరేళ్లు వ్యవహరించారు. పాక్ లో ఏడేళ్లు అండర్ కవర్ లో ఉన్న ఆయన.. వివాదాస్పద ఆక్రమిత కశ్మీర్ లో అనేకమంది ఏజెంట్లను ఏర్పాటు చేయటంలో ఆయన పాత్రను ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఇరాక్ లో బందీలుగా ఉన్న భారతీయ నర్సుల్ని సేఫ్ గా బయటకు తీసుకురావటంలో కీలక భూమిక పోషించిన దోవల్.. కాందహార్ విమాన హైజాక్ ఎపిసోడ్ లో తీవ్రవాదులతో చర్చలు జరిపిన అధికారుల్లో ఆయన ఒకరు. 1971 నుంచి 1999 వరకు దేశంలో చోటుచేసుకున్న 15 హైజాక్ లలో బందీల విడుదలలో దోవల్ పాత్ర చాలా ఉంది. తాజాగా పాక్ మీద భారత సైనికులు జరిపిన లక్షిత దాడుల వెనుక వ్యూహరచన మొత్తం దోవల్ దేనని చెబుతారు. ఆపరేషన్ సక్సెస్ అయ్యాక.. ప్రధాని మోడీకి తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఫోన్ చేసిన దోవ‌ల్‌.. ఆపరేషన్ సక్సెస్ అని చెప్పార‌ట‌.