Begin typing your search above and press return to search.

ఇవాళ ధోవల్ కు మోడీ ఏం చెప్పారు..?

By:  Tupaki Desk   |   3 Oct 2016 9:57 AM GMT
ఇవాళ ధోవల్ కు మోడీ ఏం చెప్పారు..?
X
కీలక సమావేశం ముగిసింది. భారత్ జరిపిన సర్జికల్ దాడుల అనంతరం ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతున్న పాక్.. అప్పటి నుంచి నియంత్రణ రేఖ వద్ద నిబంధనల్ని ఉల్లంఘిస్తూ తరచూ కాల్పులు జరపటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆదివారం రాత్రి బారాముల్లాలోని రాష్ట్రీయ రైఫిల్స్ క్వార్టర్స్ పై పాక్ ఉగ్ర‌వాదులు ఆత్మాహుతి దాడి చేయగా.. సోమవారం ఉదయం ఫూంచ్ సెక్టారులో సైనికులపై పాక్ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. ఇలా.. ఓ పక్క పాక్ సైన్యం.. మరోవైపు ఉగ్రవాదులు వీలైనంత ఎక్కువగా దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కొద్ది సేపటి క్రితం భేటీ అయ్యారు.

వీరి సమావేశంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై చర్చ జ‌రిగినట్లుగా చెబుతున్నారు. ధోవల్ చెప్పిన సమాచారాన్ని పూర్తిగా విన్న మోడీ.. ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించటంతో పాటు.. చొరబాట్ల విషయంలో ఎలాంటి అవకాశం ఇవ్వొదని చెప్పినట్లుగా చెబుతున్నారు. పాక్ సరిహద్దుల నుంచి జరుపుతున్నకాల్పుల్ని తేలిగ్గా తీసుకోవద్దని.. బలంగా తిప్పికొట్టాలని సూచించినట్లుగా తెలుస్తోంది.

రాష్ట్రీయ రైఫిల్స్ క్వార్టర్స్ పై దాడి జరిపి పారిపోయిన వారి ఉదంతంపై ప్రధాని సీరియస్ గా ఉన్నారని చెబుతున్నారు. వారిని ఎలా వదిలిపెడతారని ప్రశ్నించిన ఆయన.. వారి కోసం వెతకాలని.. అదుపులోకి తీసుకోవటం లేదంటే ఎన్ కౌంటర్ చేయాలన్న ఆదేశాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. సర్జికల్ దాడుల అనంతరం పాక్ చేష్టల్ని తీవ్రంగా పరిగణించిన మోడీ.. ధోవల్ కు తాజాగా కీలక ఆదేశాలు ఇచ్చి ఉంటారన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/