Begin typing your search above and press return to search.

మర్యాద తెలియని వారు పర్యాటక ప్రచారకర్తా?

By:  Tupaki Desk   |   13 April 2016 8:09 AM GMT
మర్యాద తెలియని వారు పర్యాటక ప్రచారకర్తా?
X
బ్రాండ్‌ అంబాసిడర్‌ అంటే అదేమీ మామూలు మోడలింగ్‌ లాంటి పని కాదు. మోడలింగ్‌ అంటే జస్ట్‌ ఫోటో షూట్‌ కు వచ్చి కాసేపు పోజులిచ్చి వెళ్లిపోతే సరిపోతుంది. కానీ బ్రాండ్‌ అంబాసిడర్‌ అంటే అలా కాదు. ఆ బాధ్యత అప్పగించిన సంస్థకు - ఉత్పత్తికి పూర్తిగా బాధ్యత వహించాలి. స్వతహాగా తన ప్రవర్తనలో దానికి అనుగుణమైన శైలి - బాడీలాంగ్వేజ్‌ - మర్యాద తదితర విషయాలు ఉండాలి. అయినా ఏదో వ్యాపారాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా వ్యవహరించడానికీ, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి - ఒక పర్యాటక శాఖ బ్రాండ్‌ అంబాసిడర్‌ గా వారి కీర్తిని ప్రపంచం ముందు నిలబెట్టడం వేరు. ప్రభుత్వాలకోసం పనిచేసే వారి ప్రవర్తనలోనూ ప్రతి చిన్న విషయం కూడా విపరీతంగా నలుగురి దృష్టిని ఆకర్షిస్తుంది.

అందువల్లనే.. పెద్దల పట్ల కనీస మర్యాదలు కనబరచడం కూడా తెలియని బాలీవుడ్‌ సాంప్రదాయాల హీరో.. ఉగ్గుపాలనుంచి మనకు అలాంటి అలవాటును నేర్పే తెలుగుదనానికి - ప్రత్యేకించి తెలుగు రాష్ట్రం పర్యాటక శాఖకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు.

అమరావతిలో ఎంటర్‌ టైన్‌ మెంట్‌ సిటీ కట్టుకోవాలన్న తన వ్యాపార ప్రతిపాదనతో హైదరాబాదుకు వచ్చిన అజయ్‌ దేవగన్‌ - బెజవాడలో చంద్రబాబును కలిశారు. ఏదో అడిగారు కదాని భార్యతో కలిసి పర్యాటక శాఖకు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా చేయడానికి ఒప్పుకున్నారు. కానీ చంద్రబాబు ఎదుట ఆయన కూర్చున్న తీరు లాంటివి ఫోటోలు గమనించిన ప్రజలకు మాత్రం కంటగింపు పుట్టిస్తున్నాయి. ప్రత్యక్షంగా ఆయన ఎలా ప్రవర్తించారో గానీ.. ఫోటోల్లో.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుట.. కాలు మీద కాలు వేసుకుని చాలా నిర్లక్ష్యంగా ఆయన కూర్చున్న భంగిమ ఆయన తత్వాన్ని చెబుతోందని పలువురు అంటున్నారు.

చంద్రబాబు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. హోదా పరంగా చాలా పెద్ద వ్యక్తి. వయస్సులో కూడా ఈ హీరో కంటె చాలా పెద్దవారు. అలాంటి వారి ఎదుట తాను కనబరచాల్సిన కనీస మర్యాదలు కూడా తెలియని ఈ హీరో.. ప్రపంచం ఎదుట మన పర్యాటక శాఖ గౌరవాన్ని ఏం కాపాడుతాడని పలువురు అంటున్నారు.