Begin typing your search above and press return to search.

షాకింగ్.. ఆ ఎమ్మెల్యేపై దేశద్రోహం కేసు!

By:  Tupaki Desk   |   8 April 2020 10:00 AM IST
షాకింగ్.. ఆ ఎమ్మెల్యేపై దేశద్రోహం కేసు!
X
అవును.. అతడో ప్రజాప్రతినిధి. ఏకంగా ఎమ్మెల్యే. అలాంటి ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయటమే కాదు.. అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన సంచలన ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. అసోం రాష్ట్రంలోని ఇస్లాం ఆలిండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అమినుల్ ఇస్లాంపై దేశ ద్రోహం కేసు నమోదైంది. ఆయన దింగ్ అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ప్రస్తుతం అసోంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. కరోనా నేపథ్యంలో సదరు ఎమ్మెల్యే ఒక వ్యక్తితో మాట్లాడిన ఆడియో టేప్ బయటకు రావటం.. అందులో వివాదాస్పద వ్యాఖ్యలు ఉండటంతో చర్యలు తీసుకున్నారు. అసోంలోని ముస్లింలకు వ్యతిరేకంగా బీజేపీ సర్కారు కుట్ర పన్నినట్లుగా సదరు ఎమ్మెల్యే ఆరోపించారు. మర్కజ్ సదస్సులో పాల్గొని వచ్చిన వారిని క్వారంటైన్ లో ఉంచారని.. అలాంటి వారిపై అక్కడి సిబ్బంది వేధింపులకు గురి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.

క్వారంటైన్ సెంటర్లలో ఆరోగ్యంగా ఉన్న వారికి కూడా ఇంజెక్షన్లు ఇస్తున్నారని.. వారిని కూడా కరోనా రోగులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లుగా విద్వేష వ్యాఖ్యలు చేశారు. విపక్ష ఎమ్మెల్యే చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సదరు ఎమ్మెల్యే తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా వ్యాఖ్యానిస్తున్నారని నిలదీస్తున్నారు. దేశంలో నమోదైన కేసుల్లో ఎక్కువగా మర్కజ్ కేసులేనన్న విషయం ఇటీవల కాలంలో నిరూపితమవుతున్న వేళ.. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యల పై అసోం సర్కారు సీరియస్ అయ్యింది. ఇలాంటి తీరును తాము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమన్న విషయాన్ని స్పష్టం చేస్తూ దేశ ద్రోహం కేసు నమోదు చేయటమే అరెస్టు చేశారు. ఇటీవల కాలంలో ఒక ఎమ్మెల్యే మీద దేశ ద్రోహం కేసు నమోదు ఇదేనన్న మాట వినిపిస్తోంది.