Begin typing your search above and press return to search.

అదానీ.. అంబానీలపై ఎయిర్ టెల్ పెద్ద కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   28 Aug 2022 5:36 AM GMT
అదానీ.. అంబానీలపై ఎయిర్ టెల్ పెద్ద కీలక వ్యాఖ్యలు
X
టెలికాం ప్రపంచం మొత్తం 5జీ గురించే మాట్లాడుకుంటోంది. ఈ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పెను మార్పులు చోటు చేసుకుంటాయన్న మాట వినిపిస్తోంది. 5జీ స్పెక్ట్రంను సొంతం చేసుకున్న టెలికం సంస్థలు.. ఆ సేవల్ని తమ వినియోగదారులకు అందించేందుకు వీలుగా వడివడిగా ప్లాన్లు వేస్తున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో మునిగిపోయాయి. వ్యాపార ప్రత్యర్థుల కంటే తాము ముందు ఉండాలని తపిస్తున్నాయి.

5జీ స్పెక్ట్రంను టెలికం సంస్థలతో పాటు అదానీ గ్రూప్ కూడా సొంతం చేసుకోవటం ఆసక్తికరంగా మారింది. అయితే.. తాము టెలికం రంగంలోకి ప్రవేశించటం లేదన్న విషయాన్ని అదానీ గ్రూప్ ఇప్పటికే స్పష్టం చేసినా.. స్పెక్ట్రం కొనుగోలుపై చర్చ సాగుతూనే ఉంది. దీనిపై అదానీ గ్రూప్ వివరణ ఇస్తూ.. తమ వ్యాపారాలను డిజిటల్‌గా ఏకీకృతం చేసి, డేటాసెంటర్లను లింక్ చేస్తామని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పారిశ్రామిక క్లౌడ్ కార్యకలాపాలను నిర్మిస్తామని.. 400 మిలియన్ల కస్టమర్ బేస్‌లో సేవలను అందించడానికి సూపర్ యాప్‌ను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా 5జీవేలంలో 400 MHz స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసినట్లుగా వెల్లడించింది.

మరోవైపు.. ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 5జీ సేవల రేసులో పోటీదారుల్ని తాను స్వాగతిస్తామన్న ఆయన జియోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ బలహీనతతో పాటు బలాన్ని చెప్పుకున్న సునీల్ మిట్టల్ మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీలో జరిగిన ఒక సమ్మిట్ కు హాజరైన సునీల్ మిట్టల్ మాట్లాడుతూ.. పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ 5జీ సేవల్లో ఎయిర్ టెల్ అత్యుత్తమ సేవలు అందిస్తుందన్నారు.

టెలికం రేసులో పోటీదారులను స్వాగతిస్తామన్న ఆయన.. స్పెక్ట్రమ్ రేసులో అదానీ గ్రూప్ నకు సేవ చేస్తామన్న వ్యాఖ్యలు చేశారు. తన సొంత స్పెక్ట్రం ఉన్న అదానీకి ఎయిర్ టెల్ అవసరం ఏమిటన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. 'జర్మనీలో సొంత స్పెక్ట్రం ఉన్నప్పటికీ బీఎండబ్ల్యూ వోడాఫోన్ తో జత కట్టింది. సాంకేతిక సేవలు అందిస్తోంది. అదే రీతిలో మేం కూడా అదానీ గ్రూప్ నకు సేవలు అందిస్తామన్న నమ్మకం ఉంది. మార్కెట్ లో అత్యుత్తమ 5జీ సేవల్ని అందిస్తాం. మిగిలిన వారు మమ్మల్ని ఫాలో అయ్యేలా చేస్తాం' అని వ్యాఖ్యానించారు.

తన వ్యాపార ప్రత్యర్థి రిలయన్స్ జియో అధిక్యత గురించి మాట్లాడిన మిట్టల్.. మూలధనం విషయంలో తాము జియోతో పోటీ పడలేకపోవచ్చు కానీ టెక్నాలజీ.. 5జీ సేవల్లో మాత్రం తామే ముందుంటామన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో స్పెక్ట్రమ్ వ్యాపారంలో కేవలం ఇద్దరం మాత్రమే ఉన్నామని చెప్పిన మిట్టల్.. 'ఒకరు అమెరికా క్రెయిగ్ మెక్ కావ్ అయితే.. మరొకటి భారతి ఎయిర్ టెల్' అని పేర్కొన్నారు. జియోతో పోలిస్తే తమ కంపెనీకి ఉన్న బలహీనత చెప్పేందుకు మొహమాటపడని మిట్టల్.. దాన్ని అధిగమించేందుకు తామేం చేస్తామన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారని చెప్పాలి.