Begin typing your search above and press return to search.

చిద్దూ అడ్డంగా బుక్క‌య్యారుగా!

By:  Tupaki Desk   |   4 April 2017 11:09 AM GMT
చిద్దూ అడ్డంగా బుక్క‌య్యారుగా!
X
కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబ‌రం అడ్డంగా బుక్క‌యిన‌ట్టే ఉంది. ఎందుకంటే... ఎయిర్‌ సెల్‌-మాక్సిస్ ఒప్పందంలో భాగంగా నాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న చిదంబ‌రం... నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగానే వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా త‌న‌కు తానే ఒప్పుకున్న‌ట్లుగా స్వ‌యంగా ఆయ‌న విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌నే చెబుతోంది. బీజేపీ ఫైర్ బ్రాండ్‌ - ఆ పార్టీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్యం స్వామి సుప్రీంకోర్టులో వేసిన పిటిష‌న్‌పై నిన్న విచార‌ణ జ‌రిగింది. స‌ద‌రు విచార‌ణ‌లో భాగంగా స్వామి... ప‌లు కీల‌క విష‌యాల‌ను కోర్టు ముందు ఉంచారు.

విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబడుల బోర్డు (ఎఫ్ ఐపీబీ) మార్గ నిర్దేశాల ప్ర‌కారం రూ.600 కోట్ల మేర పెట్టుబ‌డుల విష‌యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నేరుగానే గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌వ‌చ్చ‌ని, అయితే ఎయిర్‌ సెల్- మ్యాక్సిస్ ఒప్పందంలో ఈ విలువ రూ.3,500 కోట్లుగా ఉంద‌ని, ఈ నేప‌థ్యంలో చిదంబ‌రం ఎలా అనుమ‌తి ఇస్తార‌ని ఆయ‌న స్వామి ప్ర‌శ్నించారు. రూ.600 కోట్ల విలువ క‌లిగిన ఎఫ్ ఐపీబీ పెట్టుబడుల విష‌యాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ‌... ప్ర‌ధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ)కు నివేదించాల్సి ఉంద‌ని తెలిపారు. మ‌రి ఎయిర్‌ సెల్‌-మ్యాక్సిస్ ఒప్పందంలో భాగంగా ఈ విధంగా చిదంబ‌రం వ్య‌వ‌హ‌రించ‌లేద‌న్న విష‌యం రూఢీ అవుతోంద‌ని కూడా స్వామి కోర్టుకు తెలిపారు.

అయితే నిన్న జ‌రిగిన ఈ విచార‌ణ‌కు సంబంధించి చిదంబ‌రం కాసేప‌టి క్రితం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ ప్ర‌క‌ట‌న‌లో ఈ ఒప్పందానికి సంబంధించి తాను నిబంధ‌న‌ల మేర‌కే న‌డుచుకున్నాన‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న‌... ఎయిర్‌ సెల్‌- మ్యాక్సిస్ ఒప్పందాన్ని ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ)కు నివేదించలేద‌ని చెప్ప‌క‌నే చెప్పేశారు. అంటే చిదంబ‌రం ఈ వ్య‌వ‌హారంలో అడ్డంగా బుక్క‌య్యార‌ని త‌న‌కు తాన‌రే ఒప్పుకున్న‌ట్లైంద‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రి స్వామి వాద‌న‌, చిదంబ‌రం ప్ర‌క‌ట‌న‌ల‌ను ఆధారం చేసుకుని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఎలా స్పందిస్తుందోన‌న్న చ‌ర్చ ఇప్పుడు స‌ర్వత్ర వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/