Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ ఒకటే మార్గమా ?

By:  Tupaki Desk   |   14 Nov 2021 11:44 AM IST
లాక్ డౌన్ ఒకటే మార్గమా ?
X
ఢిల్లీలో వాయుకాలుష్యాన్ని కంట్రోల్ చేయాలంటే లాక్ డౌన్ ఒకటే మార్గమా ? అవుననే అంటున్నారు శాస్త్రజ్ఞులు, వాతావరణ నిపుణులు. ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ప్రమాధకరంగా మారటానికి ప్రధాన కారణం పరిశ్రమల నుండి బయటకు వస్తున్న విషవాయువులు, వాహనాల నుండి వస్తున్న పొగలు. వీటికి తోడు వ్యవసాయ వ్యర్ధాలను బహిరంగంగా కాల్చేయటమే. ఈ మూడు కారణాల వల్ల దేశ రాజధానిలో వాతావరణ కాలుష్యం ప్రమాదకరస్ధాయిని కూడా ఎప్పుడో దాటేసింది.

వాతావరణ కాలుష్య సూచిలో 200 పాయింట్లు ఉంటే వాతాతవరణ కాలుష్యం పెద్దగా లేనట్లే లెక్కట. 200 పాయింట్లు దాటి 250కి చేరువగా ఉంటే మాత్రం కాలుష్యం ప్రమాదకరంగా మారబోతోందని అర్ధం. కానీ ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ఏ స్ధాయిలో ఉందంటే సుప్రింకోర్టు చెప్పినదాని ప్రకారమే 500 పాయింట్లను టచ్ చేసింది. అంటే ఢిల్లీ జనాలు రోడ్లమీద తిరగటం కాదు ఇళ్ళల్లో కూర్చున్నా ప్రమాదకరమైన వాయువులను పీల్చుతున్నట్లే లెక్క.

అందుకనే ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, వ్యాపారస్తులు, చివరకు స్కూళ్ళకు వెళ్ళే పిల్లలు కూడా ఆక్సిజన్ మాస్కులు పెట్టుకునే రోడ్లపైన తిరుగుతున్నారు. ఢిల్లీకి ప్రధాన సమస్య ఏమిటంటే సరిహద్దులకు ఆనుకునే పంజాబ్, హర్యానాలుండటం. ఈ రెండు రాష్ట్రాలు వ్యవసాయ, పరిశ్రమల ఆధారిత రాష్ట్రాలు. ఈ రెండు రాష్ట్రాల్లోని పరిశ్రమల నుండి వచ్చే విషవాయువులు, వ్యవసాయ వ్యర్ధాలను కాల్చేటపుడు వెలువడే విషవాయువులంతా ఢిల్లీని కమ్మేస్తోంది. దీనికి అదనంగా ఢిల్లీలో ఉండే పరిశ్రమల విషవాయువులు తోడవ్వటంతో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది.

ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు అరవింద్ కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో వాహనాలకు సరిసంఖ్య, బేసిసంఖ్య ప్రయోగం చేశారు. అంటే ఒకరోజు సరిసంఖ్య ఉన్న వాహనాలు మరోరోజు బేసిసంఖ్య నెంబరు ప్లేటున్న వాహనాలే రోడ్లపైకి రావాలి. ఆ ప్రయోగం కొంతవరకు విజయంసాధించింది. అయితే ఎవరో కోర్టులో కేసు వేయటంతో ప్రయోగాన్ని ఆపేయాల్సొచ్చింది. ఈ మధ్య కరోనా వైరస్ కారణంగా కేంద్రం లాక్ డౌన్ విధించింది. కరోనా పుణ్యమాని ఢిల్లీలో వాహనాలు కొన్నిరోజుల పాటు రోడ్లపైకి రాలేదు. దాంతో వాతావరణ కాలుష్యం పూర్తిగా కంట్రోలైపోయింది.

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఇపుడు సుప్రింకోర్టు ఢిల్లీలో మళ్ళీ లాక్ డౌన్ విధించే అవకాశాలను పరిశీలించమని పదే పదే కేంద్రాన్ని కోరుతోంది. ఇపుడు పరిస్ధితి ఢిల్లీలో ఎలా తయారైందంటే లాక్ డౌన్ విధిస్తే కానీ వాతావరణ కాలుష్యం తగ్గేట్లు లేదు. లాక్ డౌన్ ప్రయోగం ఒక్క ఢిల్లీకే కాదు దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలోను తరచూ ప్రయోగిస్తే కానీ వాతావరణ కాలుష్యం నియంత్రణలోకి వచ్చేట్లు లేదని శాస్త్రజ్ఞులు, వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. మరి దీనికి కేంద్రం, సుప్రింకోర్టు ఏమంటాయో చూడాల్సిందే.