Begin typing your search above and press return to search.

కరోనాతో ఇదొక్కటే మంచి..కాలుష్యం గాయబ్!

By:  Tupaki Desk   |   10 April 2020 2:30 AM GMT
కరోనాతో ఇదొక్కటే మంచి..కాలుష్యం గాయబ్!
X
కరోనా వైరస్ పేరు వింటేనే వణికిపోతున్నాం. యావత్తు ప్రపంచంలోనూ ఇదే భయం వ్యక్తమవుతోంది. ప్రాణాలు తీసే కరోనా వైరస్ అంటే ఎవరికైనా భయమే కదా. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నింటినీ లాక్ డౌన్ లోకి నెట్టేసిన కరోనా... విశ్వవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలను బలిగొంది. లక్షలాది మందిని ఆస్పత్రుల పాల్జేసింది. ఈ వైరస్ వ్యాప్తికి ఇంకా కట్టడి సాధ్యం కాని నేపథ్యంలో మరెన్ని ప్రాణాలు పోతాయో? మరెంత మంది ఆస్పత్రుల పాలవుతారో కూడా తెలియని పరిస్థితి. మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో నష్టాన్ని చేస్తున్న కరోనా... మంచి పనులను కూడా చేస్తోందనే చెప్పాలి. అయితే ఆ మంచి ఒకే ఒక్క విషయంలోనేనని, అది కూడా అదేదో చిన్నదని చెప్పడానికి లేదు. ఎందుకంటే... కరోనా చేస్తున్న ఆ మంచి కారణంగా విశ్వవ్యాప్తంగా నగరాల్లో నివసిస్తున్న వారు స్వచ్చమైన గాలిని పీలుస్తున్నారు మరి. కరోనా చేస్తున్న ఆ ఒక్క మంచి పని గురించి కాస్తంత లోతుగా చెప్పుకుందాం పదండి.

కరోనా జన్మస్థానంగా రికార్డులకెక్కిన చైనా నగరం వూహాన్ ఒకప్పుడు కాలుష్యానికి పెట్టింది పేరు. అయితే ఎప్పుడైతే కరోనా ఎంట్రీ ఇచ్చిందో... అప్పుడే వూహాన్ లో కాలుష్యం స్థాయి అమాంతంగా తగ్గిపోయింది. అదెలాగంటే... కరోనా వ్యాప్తిని అరికట్టే దిశగా చైనా ప్రభుత్వం వూహాన్ ను పూర్తిగా లాక్ డౌన్ చేసిపారేసింది. దీంతో వూహాన్ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారగా... రోడ్లపై ఒక్కటంటే ఒక్క వాహనం కూడా కనిపించలేదు. అదే విధంగా పారిశ్రామిక ఉత్పత్తి మొత్తం బంద్ అయిపోయింది. మొత్తంగా కాలుష్యాలను వెదజల్లే కార్యక్రమాలన్నీ ఆగిపోగా... కాలుష్యం ఒక్కసారిగా తగ్గిపోయింది. ఫలితంగా కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన వూహాన్ ప్రజలకు స్వచ్ఛమైన గాలి పీల్చే అవకాశం దక్కింది.

సేమ్ వూహాన్ స్టోరీ... లాక్ డౌన్ లోకి వెళ్లిన అన్ని దేశాల్లో రిపీటైంది. కరోనా కారణంగా అన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటించగా... ఆయా దేశాల్లోని నగరాల్లో కాలుష్యం భారీగా తగ్గిపోగా... ఆయా నగరాల ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకునే వెసులుబాటు లభించింది. ఈ తరహా మంచి పరిణామం మన దేశంలోనూ చాలా స్పష్టంగానే కనిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా రికార్డులకెక్కిన ఘజియాబాద్ లో ఇప్పుడు కాలుష్యం బారీగా స్థాయిలో తగ్గిపోయింది. ఇక మన దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యంతో ఎంతగా ఇబ్బంది పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో ఢిల్లీ ప్రజలు ఇప్పుడు స్వచ్ఛమైన గాలిని పీలుస్తున్నారు. అంతేనా... జలంధర్ వాసులకు కరోనా ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. ఇప్పటిదాకా ఏనాడూ హిమాలయాలను జలంధర్ నుంచే చూడని ఆ నగర వాసులు.. కరోనా పుణ్యమా అని హిమాలయాలకు వెళ్లకుండానే.. తమ ఇళ్ల వద్ద నుంచే హిమాలయాలను చూస్తున్నారు.