Begin typing your search above and press return to search.

పిశాచి రాజ్యంలోని మనోళ్ల కోసం మరో స్పెషల్ ఫ్లైట్

By:  Tupaki Desk   |   19 Feb 2020 4:42 AM GMT
పిశాచి రాజ్యంలోని మనోళ్ల కోసం మరో స్పెషల్ ఫ్లైట్
X
కరాళ నృత్యం అన్న మాటే కానీ.. అదెలా ఉంటుందో కొవిడ్ వైరస్ పిశాచి అందరికి తెలిసేలా చేస్తోంది. అంతకంతకూ విస్తరిస్తున్న వైరస్ కారణంగా కొవిడ్ వైరస్ పుట్టినిల్లు అయిన వూహాన్ మహానగరంలో ఇప్పుడు శశ్మాన నిశ్శబద్దం రాజ్యమేలుతోంది. భయం గుప్పిట్లో ఆ నగర ప్రజలు గడిచిన కొన్ని వారాలుగా ఉండిపోతున్నారు. ఎప్పుడు.. ఏ రీతిలో కొవిడ్ వైరస్ తమ మీద విరుచుకుపడుతుందో అన్న భయాందోళనలతో ఉండిపోతున్నారు. మొత్తంగా చూసినప్పుడు మొన్నటి వరకూ కళకళలాడిన వూహాన్ నగరం ఇప్పుడు కొవిడ్ పిశాచి ఏలుబడిలోకి వెళ్లిపోయింది.

దాని చెర నుంచి తమ వారిని విముక్తి చేయటం కోసం చైనా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. అయినప్పటికీ.. సానుకూల ఫలితాలు రావటం లేదు. ఇప్పటికే ఈ పిశాచి బారిన పడి దగ్గర దగ్గర 1900 మంది వరకు మరణించారు. ఈ మరణాలు అంతకంతకూ పెరగటమే కాదు తగ్గేట్లు లేవన్న మాట వినిపిస్తోంది. ఇలాంటివేళ.. వూహాన్ నగరంలో చిక్కుకుపోయి ఉన్న మనోళ్లను తీసుకొచ్చేందుకు భారత్ నుంచి ప్రత్యేక విమానాన్ని పంపుతున్నారు.

ఆ మధ్యన రెండు విమానాల్లో తీసుకొచ్చిన వారు ప్రత్యేక క్యాంపు ముగించుకొని ఇప్పుడిప్పుడే వారి వారి స్వస్థలాలకు బయలుదేరుతున్నారు. ఇలాంటివేళ.. రేపు (గురువారం) సీ17 రకం భారీ సైనిక విమానం చైనాకు మందులు.. ఇతర వైద్య సామాగ్రిని తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. అదే సమయంలో తిరుగు ప్రయాణం లో వూహాన్ నగరంలో చిక్కుకు పోయిన భారతీయుల్ని దేశానికి తీసుకురానున్నారు.

ఇప్పటి వరకూ వూహాన్ ఫ్రావిన్స్ నుంచి 640 మంది భారతీయుల్ని తీసుకొచ్చారు. వైరస్ రాజ్యమేలుతున్న హుబే ప్రావిన్స్ లో భారతీయులు దగ్గర దగ్గర వంద మంది వరకూ ఉంటారని చెబుతున్నారు. గురువారం వెళ్లే ప్రత్యేక విమానంలో మనోళ్లకు తీసుకురానున్నారు.