Begin typing your search above and press return to search.

ఎయిరిండియా వన్ సేవలు ప్రారంభం .. మొదటగా ఎవరు ప్రయాణిస్తున్నారంటే !

By:  Tupaki Desk   |   24 Nov 2020 1:40 PM IST
ఎయిరిండియా వన్ సేవలు ప్రారంభం .. మొదటగా ఎవరు ప్రయాణిస్తున్నారంటే !
X
ఎయిరిండియా వన్ .. అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానం తరహాలో భారత్ కు కూడా ఓ విమానం ఉండాలన్న ఆలోచనతో కేంద్రం ప్రముఖ విమాన తయారీదారు బోయింగ్ సంస్థకు ఆర్డర్ ఇచ్చింది. ఇలాంటివే రెండు విమానాలు అందించాలని తెలిపింది. ఈ క్రమంలో ఎయిరిండియా సంస్థ తన వద్ద ఉన్న రెండు బీ-777 విమానాలను ఆధునికీకరణ కోసం డల్లాస్ లోని బోయింగ్ తయారీ కేంద్రానికి పంపింది. అక్కడ భారత పెద్దల అవసరాలకు తగిన విధంగా బోయింగ్ సంస్థ ఓ బీ-777 విమానాన్ని ఎయిరిండియా వన్ విమానంగా తీర్చిదిద్దింది.

ఈ ఎయిరిండియా వన్ విమానంలో క్షిపణి దాడులను ఎదుర్కొనేందుకు అవసరమైన అధునాతన వ్యవస్థలను పొందుపరిచారు. ఈ విమానంలో ఎంతో సమర్థవంతంగా పనిచేసే కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉంటాయి. విశాలమైన కార్యాలయం, సమావేశ మందిరాలు, అత్యవసర సమయాల్లో అందించే వైద్య సేవలు ఎయిరిండియా వన్ లో ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి అత్యంత ప్రముఖుల అధికారిక పర్యటనల కోసం వాటిని వినియోగిస్తారు. ఈ రెండు విమానాల కోసం ఎయిరిండియా 190 మిలియన్ డాలర్లను ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఎయిరిండియా వన్ ఎయిర్ క్రాఫ్ట్.. ఏకధాటిగా 17 గంటల పాటు ప్రయాణించగలదు.

ఈ ఎయిరిండియా వన్ తన సేవలు ప్రారంభించింది. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఆయన భార్య సవితా కోవింద్ తొలి ప్రయాణం చేయనున్నారు. ఈ కొత్త ఎయిర్ క్రాఫ్ట్‌ లో రాష్ట్రపతి దంపతులు తిరుపతికి చేరుకోబోతున్నారు. ఈ ఎయిరిండియా వన్‌ లో ప్రయాణానికి ముందు రాష్ట్రపతి దంపతులు ఈ విమానానికి పూజలు చేశారు. 10:30 గంటలకు ఈ ఎయిర్ క్రాఫ్ట్.. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనుంది. అక్కడి నుండి తిరుచానూరుకి వెళ్లి పద్మావతి అమ్మవారిని దర్శిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.15 నిమిషాలకు తిరుమలకు చేరుకుంటారు. అక్కడి పద్మావతి అతిధి గృహంలో విశ్రాంతి తీసుకోని , ఒంటిగంటకు వరాహ స్వామి దర్శిస్తారు. అనంతరం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శిస్తారు. 50 నిమిషాల పాటు వారు ఆలయ ప్రాంగణంలో గడుపుతారు. 1:55 నిమిషాలకు పద్మావతి అతిధి గృహానికి చేరుకుంటారు. విశ్రాంతి అనంతరం సాయంత్రం 4.50 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి చెన్నైకి బయలుదేరి వెళ్తారు.