Begin typing your search above and press return to search.

ఆంధ్రప్రదేశ్‌ లో సోలార్‌ ఛర్ఖా క్లస్టర్‌

By:  Tupaki Desk   |   16 March 2020 4:39 PM GMT
ఆంధ్రప్రదేశ్‌ లో సోలార్‌ ఛర్ఖా క్లస్టర్‌
X
మిషన్‌ సోలార్‌ ఛర్ఖా కింద ఆంధ్రప్రదేశ్‌ లో సోలార్‌ ఛర్ఖా క్లస్టర్‌ ను ఏర్పాటు చేయబోతున్నట్లు చిన్న - సూక్ష్మ - మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ ఎంఈ) శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సోమవారం రాజ్యసభలో ప్రకటించారు. వైఎస్సార్సీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు.

మిషన్‌ సోలార్‌ ఛర్ఖాను ఎంఎస్‌ ఎంఈ 2018-19లో ప్రారంభించింది. దీని కింద దేశంలో 50 సోలార్‌ ఛర్ఖా క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని మంత్రి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో సోలార్‌ ఛర్ఖా క్లస్టర్‌ ఏర్పాటు ద్వారా మహిళలు - యువతకు ఉపాధి కల్పిస్తూ వారు తమ సొంత కాళ్ళపై నిలబడి అభివృద్ధి చెందాలన్నది మిషన్‌ సోలార్‌ ఛర్ఖా లక్ష్యాలలో మొదటిది.

తద్వారా గ్రామీణ ఆర్థిక రంగానికి ఉత్తేజం కల్పిస్తూ గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు జరిగే వలసలను నిలవరించడం, తక్కువ ఖర్చుతో కూడిన వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామీణప్రాంత నేత కార్మికులకు అందుబాటులోకి తీసుకురావడం మిషన్‌ ఉద్ధేశాలని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఆమోదించిన 10 ప్రాజెక్ట్‌లలో ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పబోయే సోలార్‌ ఛర్ఖా క్లస్టర్‌ ఒకటని ఆయన చెప్పారు. మిషన్‌ సోలార్‌ ఛర్ఖా ద్వారా లక్ష మందికి నేరుగా ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

సంస్కృత భాషకు జీవం పోయాలి

కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయాల బిల్లుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో వి.విజయసాయి రెడ్డి మాట్లాడారు. దేవ భాషగా పరిగణించే ప్రాచీన భాష సంస్కృత భాష. దీనికి తిరిగి జీవం పోసి కొంతమేరకైనా వాడుక భాషగా మార్చాలంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో కొన్ని చర్యలు కచ్చితంగా చేపట్టాలని అన్నారు.

ఈ బిల్లు ద్వారా కేంద్రీయ విశ్వవిద్యాలయంగా రూపుదాల్చనున్న మూడు విద్యాలయాలు పదేసి గ్రామాలను ఎంపిక చేసి ఈ గ్రామాల్లో సంస్కృత భాష ప్రోత్సాహానికి కృషి చేయాలని అన్నారు. ఈ బిల్లు ఆమోదం ద్వారా తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠ్‌కు కేంద్రీయ విశ్వవిద్యాలయం హోదా లభిస్తున్నందుకు ఆయన హర్షం ప్రకటించారు. విద్యా పీఠ్‌లో ఖాళీగా ఉన్న అనేక అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరారు.