Begin typing your search above and press return to search.

ఓవైసీకి కేసీఆర్ గిఫ్ట్‌...ప్రొటెం స్పీక‌ర్‌ గా సీనియ‌ర్ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   6 Jan 2019 3:30 AM GMT
ఓవైసీకి కేసీఆర్ గిఫ్ట్‌...ప్రొటెం స్పీక‌ర్‌ గా సీనియ‌ర్ ఎమ్మెల్యే
X
తెలంగాణలో మిత్ర‌ప‌క్షాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్ర స‌మితి- ఎంఐఎంల మ‌ధ్య దోస్తీ చిక్క‌బ‌డుతోంది. తెలంగాణ‌లో మ‌రో ద‌ఫా అధికారంలో వ‌చ్చిన సంద‌ర్భంగా గులాబీ ద‌ళ‌ప‌తి మ‌రో చాన్స్ ఇచ్చారు. తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్ గా మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఎంపికయ్యారు. అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. జనవరి 16న సాయంత్రం 5 గంటలకు ప్రొటెం స్పీకర్ గా మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. గవర్న్జర్ నరసింహన్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ తో ప్రమాణస్వీకారం చేయిస్తారు.

ముంతాజ్ మహ్మద్ ఖాన్ శాసనసభకు వరుసగా ఆరుసార్లు ఎన్నికయ్యారు. ఇటీవల శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ముంతాజ్ మహ్మద్ ఖాన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ మేరకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. ముంతాజ్ మహ్మద్ ఖాన్ ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ఓవైసీ కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ శాసనసభ సమావేశాలు జనవరి 17 నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు కొనసాగనున్నాయి. జనవరి 17న ఉదయం 11:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రోటెం స్పీకర్ అధ్యక్షతన ప్రారంభమవుతాయి. నూతనంగా ఎన్నికైన శాసనసభ సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమం సుమారు రెండుగంటలు కొనసాగుతుంది. ఆ తర్వాత జూబ్లీహాల్ ప్రాంగణంలోని కౌన్సిల్ లాన్స్ లో శాసనసభ సభ్యులకు లంచ్ ఉంటుంది. 17వ తేదీన స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకటన, నామినేషన్ కార్యక్రమాలు కూడా వుంటాయి. 18వ తేదీన స్పీకర్ ఎన్నిక, ఎన్నికైనట్లు ప్రకటన వుంటాయి. ఆ తరువాత నూతనంగా ఎన్నికైన స్పీకర్ ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ప్రతిపక్ష నాయకులు, ఇతర రాజకీయ శాసనసభా పక్ష నాయకులు స్పీకర్ స్థానానికి తోడ్కొని పోతారు. అనంతరం నూతనంగా ఎన్నికైన స్పీకర్ అధ్యక్షతన సభా కార్యక్రమాలు సాగుతాయి. ఆ తర్వాత స్పీకర్ బీఎసీ సమావేశాన్ని నిర్వహిస్తారు. 19వ తేదీన శాసనసభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేస్తారు. 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టడం, దానికి సభ ఆమోదం తెలపడం జరుగుతుంది.