Begin typing your search above and press return to search.

డీఎంకేతో పొత్తు కాస్తా.. ఆ పార్టీతో కుదుర్చుకున్న ఓవైసీ

By:  Tupaki Desk   |   9 March 2021 2:55 AM GMT
డీఎంకేతో పొత్తు కాస్తా.. ఆ పార్టీతో కుదుర్చుకున్న ఓవైసీ
X
రాష్ట్రం ఏదైనా కానీ.. ఎన్నికలు జరుగుతున్నాయంటే చాలు.. పార్టీని బరిలోకి దించేందుకు సిద్ధమవుతున్న మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. తమిళనాడులో మాత్రం కాస్త భిన్నంగా వ్యవహరించారు. ప్రతి రాష్ట్రంలోనూ సొంతంగా పోటీ చేసే ఆయన.. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన రీతిలో నిర్ణయం తీసుకున్నారు. తొలుత ఆయన విపక్ష డీఎంకేతో పొత్తు పెట్టుకుంటారని భావించారు.

వాస్తవానికి డీఎంకే అధినేత స్టాలిన్ సైతం పొత్తు విషయంలో సానుకూలంగానే ఉన్నట్లు చెబుతారు. తాజాగా అందుకు భిన్నంగా చిన్నమ్మ మేనల్లుడు టీవీవీ దినకరన్ ఏర్పాటు చేసిన పార్టీతో పొత్తుకు ఓకే చేసుకున్నారు. తాజాగా ఇదే విషయాన్ని ఓవైసీ వెల్లడించారు. ఇంతకీ డీఎంకేతో ఖరారు కావాల్సిన పొత్తు.. అమ్మ మక్కల్ మున్నెట్ర కజగమ్ తో ఎందుకు పొత్తు కుదుర్చుకున్నట్లు అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

డీఎంకే పొత్తుకు ప్రయత్నించిన ఓవైసీకి.. ఆ పార్టీకి చెందిన ముస్లిం నేతలు అడ్డు తగిలారు. ఓవైసీతో పొత్తు వద్దంటే వద్దంటూ స్టాలిన్ పై ఒత్తిడి తెచ్చారు. దీంతో.. ఆయన పార్టీ నేతల మాటలకు తలొగ్గి.. పొత్తుకు ఆసక్తి ప్రదర్శించలేదు. దీంతో.. ఓవైసీ రూటు మార్చి చిన్నమ్మ మేనల్లుడి పార్టీతో పొత్తు డీల్ ఓకే చేసుకున్నారు.

తమిళనాడులో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో కనీసం ఇరవై స్థానాల్లో బరిలోకి దిగాలని మజ్లిస్ తమిళనాడు శాఖ ఒక రిపోర్టు ఇచ్చింది. అయితే.. అందుకు భిన్నంగా కేవలం మూడు స్థానాల్లో మాత్రమే పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. మరి..తాజా పొత్తు ఓవైసీకి ఎలాంటి అనుభవం మిగులుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మిగిలిన రాష్ట్రాల్లో మాదిరి తమిళనాడులోనూ ఓవైసీ తన సత్తా చాటుతారా? అన్నదిప్పుడు అసలుసిసలు ప్రశ్న.