Begin typing your search above and press return to search.

సుష్మ‌పై ట్రోలింగ్ పై కొత్త మాట చెప్పిన అస‌ద్‌

By:  Tupaki Desk   |   3 July 2018 6:20 AM GMT
సుష్మ‌పై ట్రోలింగ్ పై కొత్త మాట చెప్పిన అస‌ద్‌
X
ఒక హిందూ అమ్మాయి.. మ‌రో ముస్లిం అబ్బాయి ఇష్ట‌ప‌డి పెళ్లి చేసుకున్నారు. వారు అన్యోన్యంగా జీవిస్తున్నారు. అయితే.. వారు త‌మ పాస్ పోర్ట్ కోసం ఆఫీసుకు వెళ్లారు. అక్క‌డ ముస్లిం కుర్రాడిని పెళ్లి చేసుకున్నావేంట‌న్న మాట‌తో పాటు.. అవ‌స‌రం లేని విష‌యాల్ని ప్ర‌స్తావించిన ఉద్యోగిపై స‌ద‌రు మ‌హిళ విదేశాంగ మంత్రి సుష్మ స్వ‌రాజ్‌ కు ట్వీట్ కంప్లైంట్ చేయ‌టం.. ఆమె చ‌ర్య‌లు తీసుకోవ‌టం.. వెనువెంట‌నే విష‌యం ప‌రిష్కారం కావ‌టం జ‌రిగిపోయాయి.

ఈ విష‌యం చాలామందికి తెలిసిందే. అయితే.. సుష్మ స్పంద‌న మీద ప‌లు హిందూ అతివాదులు టార్గెట్ చేసిన వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఈ ఇష్యూలో ముస్లింల మ‌ద్ద‌తు సంపాదించుకునేందుకే సుష్మ ఇలా వ్య‌వ‌హ‌రించారంటూ ఆమెపై సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న వైనం అంత‌కంత‌కూ పెరుగుతోంది.

అస‌భ్య‌క‌రంగా ఆమెపై వ్యాఖ్య‌లు చేయ‌టంతో పాటు.. లేనిపోని విమ‌ర్శ‌ల్ని ఆమెపై సంధిస్తున్నారు. ఇంత జ‌రుగుతున్నా బీజేపీ అగ్ర‌నేత‌లు ఎవ‌రూ పెద‌వి విప్ప‌క‌పోవ‌టం ఆశ్చ‌ర్య‌క‌రంగా మారింది. పాత త‌రానికి చెందిన సుష్మా లాంటి నేత‌ల‌పై మాట‌ల దాడి జ‌రుగుతున్నా త‌మ‌కేం ప‌ట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం వెనుక మోడీ తంత్రం ఉంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇదిలా ఉంటే.. సుష్మ‌కు వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న ట్రోలింగ్ పై విపక్షాలు విదేశాంగ మంత్రికి బాస‌ట‌గా నిలిచాయి. ఆమెపై ట్రోలింగ్ ను త‌ప్పుగా ఖండిస్తున్నాయి. విప‌క్షం అండ‌గా ఉన్నా.. స్వ‌ప‌క్షం నుంచి మాత్రం సుష్మ‌కు ఎలాంటి స్పంద‌న లేక‌పోవ‌టం ఆమెను బాధిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ ఇష్యూపై మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ తాజాగా రియాక్ట్ అయ్యారు.

సుష్మ‌పై ట్రోలింగ్ దుర‌దృష్ట‌క‌రంగా ఆయ‌న అభివ‌ర్ణించారు. బీజేపీ టాప్ ఆర్డ‌ర్ ఎవ‌రూ సుష్మ‌కు అండ‌గా నిల‌వ‌క‌పోవ‌టం స‌రికాద‌న్నారు. ఈ సంద‌ర్భంగా సుష్మ‌పై ట్రోలింగ్ జ‌రుగుతున్న వైనంపై కొత్త వాద‌న‌ను తెర మీద‌కు తీసుకొచ్చారు. సుష్మ‌పై ట్రోలింగ్ వెనుక బీజేపీ సోష‌ల్ మీడియా విభాగం ఉంద‌న్న అనుమానాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. ఏది ఏమైనా.. త‌మ పార్టీకి చెందిన ఒక నేత చేసిన మంచి ప‌నిని అభినందించ‌కుండా.. ఆమెను త‌ప్పు ప‌డుతున్న మూర్ఖుల విష‌యంలో మౌనంగా ఉండ‌టం మోడీ ప‌రివారానికి ఏ మాత్రం మంచిది కాద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.