Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ వచ్చే నాటికి దేశ ప్రజలకు ఆ శక్తి వచ్చేస్తుందట

By:  Tupaki Desk   |   15 Nov 2020 2:30 AM GMT
వ్యాక్సిన్ వచ్చే నాటికి దేశ ప్రజలకు ఆ శక్తి వచ్చేస్తుందట
X
అధికారిక ప్రకటన రానప్పటికీ దేశంలో కరోనా రెండో దశ షురూ అయ్యిందన్న మాట పలువురి నోటి నుంచి వస్తోంది. ముఖ్యంగా.. ఢిల్లీ.. కేరళ రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసుల సంఖ్యను చూస్తే.. ఈ విషయం నిజమేనన్న భావన కలుగక మానదు. ఇదిగో వచ్చేస్తోంది.. అదిగో వచ్చేస్తోందంటూ చెబుతున్న కరోనా వ్యాక్సిన్.. ఏడాది చివరకు వచ్చేసినా.. ఎప్పుడు వస్తుందన్న విషయంపై కనీస అవగాహన రాని పరిస్థితి. ఎవరూ కచ్ఛితగా ఈ సమయానికి వచ్చే అవకాశం ఉందన్న మాటను చెప్పలేకపోతున్నారు.

ఇలాంటి వేళ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ 19 వ్యాక్సిన్ వచ్చే నాటికి దేశ ప్రజలు చక్కటి రోగ నిరోదక శక్తిని కలిగి ఉండే దశకు చేరుకునే వీలుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘వ్యాక్సిన్ వచ్చే నాటికి మంచి రోగనిరోధక శక్తి కలిగి ఉన్నామన్నదశకు మనం చేరుకునే వీలుంది. అప్పుడు టీకా అవసరమే ఉండదు’’ అన్న మాటను చెప్పారు.

అయితే.. ఈ విషయంలో ఒక సమస్య ఉందన్న ఆయన.. రాబోయే రోజుల్లో వైరస్ మార్పులు చెంది ఇన్ఫెక్షన్ నివారించటానికి టీకాలు వేయించుకోవాల్సి ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో వైరస్ స్పందించే తీరు ఎలా ఉంటుందన్న అంచనాను తాము వేస్తున్నామన్నారు. ఇదిలా ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా సాగుతున్న టీకాల ప్రయోగాలు చివరకు చేరుకున్నాయి. రానున్నకొద్ది నెలల్లో వ్యాక్సిన్ వచ్చేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటివేళ.. ఎయిమ్స్ డైరెక్టర్ చెబుతున్న మాట.. ఆసక్తికరంగా మారింది.