Begin typing your search above and press return to search.

చిన్న‌మ్మ‌కు మ‌ద్ద‌తు పెరిగిపోతోంది

By:  Tupaki Desk   |   12 Dec 2016 5:30 AM GMT
చిన్న‌మ్మ‌కు మ‌ద్ద‌తు పెరిగిపోతోంది
X
దివంగ‌త త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత రాజ‌కీయ వార‌సురాలిగా ఆమె నెచ్చెలి శ‌శిక‌ళ‌కు మ‌ద్ద‌తు పెరుగుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని శశికళ చేపట్టాలనే అభిప్రాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒ.పన్నీర్ సెల్వం వ్యక్తం చేసిన మరుసటి రోజే ఆ పార్టీ నాయకుడు, లోక్‌సభలో డిప్యూటి స్పీకర్ ఎం.తంబిదురై కూడా ఆమెకు మద్దతు పలికారు. ఎఐఎడిఎంకె పార్టీని భవిష్యత్తులో ముందుకు నడపడానికి శశికళ తగిన వ్యక్తి అని ఆయన పేర్కొన్నారు. పార్టీ దివంగత ముఖ్యమంత్రి జయలలితకు విశ్వాసపాత్రురాలయిన వ్యక్తి శశికళ అనే విషయం అందరికీ తెలిసిందేనని ఆయన అన్నారు.

పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలలో గతంలో జయలలితకు శశికళ సలహాలు ఇచ్చేవారని తంబిదురై వెల్లడించారు. పార్టీ పగ్గాలను చేపట్టాలని ఆయన శశికళను కోరారు. "ఇప్పుడు గౌరవనీయురాలయిన అమ్మ (జయలలిత) మన మధ్యలో లేరు. ఎఐఎడిఎంకెను ముందుకు నడిపించే సామర్థ్యం, చాతుర్యం, అనుభవం ఉన్న వ్యక్తి ఒక్క చిన్నమ్మ (శశికళ) మాత్ర మే"అని ఆయన పేర్కొన్నారు. శశికళ గత 35 సం వత్సరాలు జయలలిత సహవాసిగా ఉన్నారని, అనేక త్యాగాలు చేశారని ఆయన అన్నారు. "ప్రతీకార రాజకీయాల కారణంగా చిన్నమ్మ తప్పుడు కేసుల్లో ఇరుక్కున్నారు. ఆమె జైలుకు కూడా వెళ్లారు. అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. అలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడంలో ఆమె అమ్మకు రక్షణగా ఉన్నారు" అని పార్టీ ప్రచార కార్యదర్శి కూడా అయిన తంబిదురై ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అన్నాడీఎంకే అధినేత జయలలిత మృతి తర్వాత ఆమె వారసత్వాన్ని అందుకునేందుకు ఆమె సన్నిహితురాలు, చిన్నమ్మగా పేరొందిన శశికళ ప్రయత్నిస్తున్న క్రమంలో అన్నాడీఏంకే పుదుచ్చేరి శాఖ కూడా ఆమెకే బాసటగా నిలిచింది. ఈ నేపథ్యంలో శశికళ ఎవరు? తమిళ రాజకీయాల్లో ఆమె పాత్ర ఆస‌క్తిక‌రం. కలర్ టీవీ కుంభకోణంలో 1996 డిసెంబర్ ఏడోతేదీన అన్నాడీఎంకే అధినేత జయతోపాటు శశికళ అరెస్ట్ అయ్యారు. 30 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్‌పై ఉన్నారు. పార్టీకి సమాంతర వ్యవస్థ నడుపుతున్నారన్న అభియోగంపై శశికళను జయలలిత 2011 డిసెంబర్ 19న పార్టీ నుంచి బహిష్కరించారు. కుటుంబసభ్యులతో తెగతెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించడంతో 2012 మార్చి 31న తిరిగి పార్టీలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. శశికళకు ప్రజాసేవ తప్ప మరో ధ్యాస లేదన్నారు. అక్రమాస్తుల కేసులో జయ, మరో ఇద్దరితో కలిసి 21 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. రాజకీయాల్లోకి రాకముందు శశికళ అద్దె వీడియోల బిజినెస్ నిర్వహించారు. పెళ్లిళ్లు, ఇతర వేడుకల రికార్డింగ్‌కు వీడియో కెమెరాలను అద్దెకు ఇచ్చేవారు.