Begin typing your search above and press return to search.

తంబికి.. పవర్ బాగా తలకు ఎక్కినట్లు లేదు?

By:  Tupaki Desk   |   7 Oct 2019 11:30 AM IST
తంబికి.. పవర్ బాగా తలకు ఎక్కినట్లు లేదు?
X
చేతిలో అధికారం ఉంటే చాలు.. చెలరేగిపోయే బ్యాచ్ లకు తక్కువ ఉండదు. ఇలాంటి తీరు మిగిలిన వారితో పోలిస్తే.. అధికారపక్షంలో మరింత ఎక్కువగా ఉంటుంది. తమ నోటి మాటలతో కాలిపోయేలా మాట్లాడటంలో కొంతమంది దిట్టలుగా ఉంటారు. ఆ కోవకే చెందుతారు అన్నాడీఎంకే సీనియర్ నేత పొన్నయన్.

ప్రభుత్వ తీరును తప్పు పట్టేలా కొన్ని పరిణామాలు జరిగినప్పుడు.. ప్రజల్లో సానుభూతి వ్యక్తమయ్యే విషయాల మీద ఆచితూచి మాట్లాడాలన్న ఇంగితాన్ని సదరు సీనియర్ నేత మిస్ కావటం గమనార్హం. ఈ మధ్యన చెన్నైలోని ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసిన హోర్డింగ్ ఊడిపడటంతో ఐటీ ఇంజనీర్ శుభశ్రీ అనే అమ్మాయి అక్కడికక్కడే ప్రాణాలు విడవటం.. దీని పై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే.

అన్నాడీఎంకేకు చెందిన స్థానిక నాయకుడు జయగోపాల్ తన కొడుకు పెళ్లికి ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ ను సరిగా ఏర్పాటు చేయకపోవటంతో ఈ ప్రమాదం జరిగిందంటారు. పెళ్లికి వస్తున్న ఉప ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ ఊడి పడింది. హోర్డింగ్ పడే సమయంలో ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వెళుతున్న శుభశ్రీ మీద పడటం.. కిందపడిన ఆమె పైకి ట్యాంకర్ వెళ్లటంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఉదంతంలో ప్రధాన నిందితుడిగా హోర్డింగ్ ఏర్పాటు చేసిన అన్నాడీఎంకే నేత జయగోపాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది నచ్చని సీనియర్ అన్నాడీఎంకే నేత పొన్నయన్ ఈ ఉదంతంపై స్పందిస్తూ.. హోర్డింగ్ ఏర్పాటు చేసిన వ్యక్తి కారణంగా శుభశ్రీ చనిపోలేదు. గాలి బలంగా వీయటంతో హోర్డింగ్ ఉడి ఆమె మీద పడింది. కాబట్టి.. ఈ విషయంలో కేసు నమోదు చేయాల్సింది గాలి మీదనే అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలపై పలువురు నోరెళ్లబెడుతున్నారు. ఇప్పటికే ఈ ఉదంతంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన వేళ.. కొత్త కంపను మీదేసుకునేలా మాట్లాడిన పొన్నయన్ వ్యాఖ్యల్ని పలువురు తప్పు పడుతున్నారు.