Begin typing your search above and press return to search.

తెలంగాణ బీజేపీకి మరో భారీ షాక్

By:  Tupaki Desk   |   1 Nov 2020 7:30 PM IST
తెలంగాణ బీజేపీకి మరో భారీ షాక్
X
దుబ్బాక ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి గట్టి షాక్ తగిలింది. టీఆర్ఎస్ తో నువ్వా నేనా అన్నట్టుగా ఢీకొంటున్న బీజేపీకి పలువురు నేతలు టాటా చెప్పి టీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలలో చేరడం దెబ్బతీసింది. తెలంగాణలో బలపడాలనుకుంటున్న బీజేపీకి మరో భారీ షాక్ తగిలింది.

బీజేపీకి చెందిన కీలక నేత రావుల శ్రీధర్ రెడ్డి కమలం పార్టీకి రాజీనామా చేశారు. మరికాసేపట్లోనే ఆయన అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం. ఈ విషయం తెలియగానే ఆయన అభిమానులు, అనుచరులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రావుల ఇంటికి చేరుకుంటున్నారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రావుల టీఆర్ఎస్ లో చేరబోతున్నట్టు తెలిసింది. దీనిపై ఈరోజు రాత్రికి క్లారిటీ రానుంది.

రావుల శ్రీధర్ బీజేపీ తరుఫున బలంగా వాయిస్ వినిపించే నేతల్లో ఒకరు. టీవీ చర్చల్లో బీజేపీ తరుఫున బల్లగుద్ది వాదిస్తారు. డిబేట్లలో పాల్గొనే ప్రత్యర్థి పార్టీల నేతలపై కౌంటర్ల వర్షం కురిపిస్తారు. దుబ్బాక ఎన్నికలపై ఆయన టీఆర్ఎస్ పై దుమ్మెత్తిపోశారు. సడన్ గా పార్టీకి రాజీనామా చేయడం సంచలనమైంది.

బీజేపీ అభ్యర్థిగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లిహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీచేసి రావుల శ్రీధర్ ఓడిపోయాడు. బీజేపీ అధికార ప్రతినిధిగా గతంలో పనిచేశారు. అయితే బండి సంజయ్ వచ్చాక ఈయనకు పదవి ఏమీ ఇవ్వలేదు. ఇటీవల రాష్ట్ర కమిటీలో చోటు దక్కలేదు. దీంతో అసంతృప్తికి గురైన శ్రీధర్ రెడ్డి పార్టీ మారుతున్నట్టు తెలుస్తోంది. ఆయన ఏపార్టీలో చేరుతారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.