Begin typing your search above and press return to search.

మోడీకి దెబ్బ‌సేందుకు యూపీలో మ‌హాకూట‌మి!

By:  Tupaki Desk   |   31 July 2018 12:06 PM GMT
మోడీకి దెబ్బ‌సేందుకు యూపీలో మ‌హాకూట‌మి!
X
కీల‌క రాజ‌కీయ ప‌రిణామానికి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వేదికైంది. మోడీ స‌ర్కారుకు నూక‌లు చెల్లేలా చేయ‌టం.. బీజేపీ ఓట‌మే ల‌క్ష్యంగా చేసుకొని తాజాగా మ‌హా కూట‌మి ఆవిర్భావం జ‌రిగిపోయింది. గ‌డిచిన కొద్దిరోజులుగా యూపీ మ‌హా కూట‌మికి సంబంధించిన వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెల‌సిందే. తాజాగా.. త‌మ రాజ‌కీయ విబేధాల్ని ప‌క్క‌న పెట్టి.. స‌మిష్టిగా ప‌ని చేయ‌టం ద్వారా బీజేపీకి షాకిచ్చేందుకు కీల‌క‌మైన నాలుగు పార్టీలు చేతులు క‌లిపాయి.

త‌మ మ‌హా కూట‌మి నిర్ణ‌యంతో దేశ రాజ‌కీయాలు సైతం ప్ర‌భావితం అయ్యే అవ‌కాశం ఉందంటున్నారు. యూపీలోని 80 లోక్ స‌భ స్థానాల్ని భారీగా సొంతం చేసుకోవ‌టం ద్వారా 2019లో కేంద్రంలో ప్ర‌భుత్వ ఏర్పాటే ల‌క్ష్యంగా ఈ మ‌హా కూట‌మి ప‌ని చేయ‌నుంది.

ఈ కూట‌మిలో కాంగ్రెస్‌.. స‌మాజ్ వాదీ పార్టీ.. బ‌హుజ‌న్ స‌మాజ్ వాదీ.. ఆర్ ఎల్డీలు భాగ‌స్వామ్య ప‌క్షాలుగా ఉండ‌నున్నాయి. వీరంతా కలిసి ఒక కూట‌మిగా ఏర్ప‌డి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాల‌ని నిర్ణ‌యించారు. ఇక‌.. పోటీలో ఏ స్థానం నుంచి ఏ పార్టీ పోటీ చేయాల‌న్న అంశంపై క‌స‌ర‌త్తు త‌ర్వాత చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్లుగా తెలుస్తోంది. 2019లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీని మ‌ట్టి క‌రిపించాలంటే యూపీలో అత్య‌ధిక స్థానాల్ని గెలుచుకోవాల్సి ఉంటుంది. ఏ పార్టీ అయితే యూపీలో ఎక్కువ సీట్లు సొంతం చేసుకుంటే ఆ పార్టీనే కేంద్రంలో చ‌క్రం తిప్పే వీలుంది.

ఈ నేప‌థ్యంలో నాలుగు ప్ర‌ముఖ పార్టీలు ఏక‌మై.. మ‌హా కూట‌మిగా మారి బీజేపీపై స‌మ‌ర‌శంఖాన్ని పూరించ‌నున్నారు. ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాలు స‌మైక్యంగా పోటీ చేసి.. ఇటీవ‌ల జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లోసంచ‌ల‌న విజ‌యాన్ని సాధించ‌టం తెలిసిందే. గోర‌ఖ్ పూర్.. పూల్పూర్.. కైరానా.. నూర్పుర్ లోక్ స‌భా స్థానాల‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో బీజేపీపై పోటీ చేసి విజ‌యాన్ని సొంతం చేసుకున్నాయి. ఇదే ఊపులో.. త‌మ కూట‌మిని కొన‌సాగిస్తూ.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోడీ అండ్ కోకు షాకివ్వాల‌ని నిర్ణ‌యించారు. మ‌రి.. దీనికి మోడీషాలు ఎలాంటి ప్లాన్ వేస్తారో చూడాలి.