Begin typing your search above and press return to search.

రాజ్యసభలో వ్యవసాయ బిల్లు.. వైసీపీ ఏం చేయనుంది?

By:  Tupaki Desk   |   20 Sep 2020 5:42 AM GMT
రాజ్యసభలో వ్యవసాయ బిల్లు.. వైసీపీ ఏం చేయనుంది?
X
రైతుల గొంతుకోసేలా కేంద్రం వ్యవసాయ బిల్లులు ఉన్నాయని ఓవైపు దేశవ్యాప్తంగా ఆందోళనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. వివిధ పార్టీలు, రైతులు, సంఘాలు ఆందోళన బాటపట్టాయి. పలురాష్ట్రాల సీఎంలు సైతం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. నిరసనలకు కేంద్రంగా ఉన్న హర్యానాలో అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అడుగడుగునా పోలీసులు భారీగా మోహరించారు.

వ్యవసాయ సంబంధ బిల్లులను సంబంధిత మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ఆదివారం ఉదయం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఇదివరకే పార్లమెంట్‌లో ఆమోదం పొందిన ఈ బిల్లుతో ప్రయోజనమే కాని నష్టం లేదని నరేంద్రసింగ్‌ తెలిపారు. అలాగే రైతులు తమ ఉత్పత్తులను దళారులకు అమ్ముకోకుండా స్వేచ్ఛగా బహిరంగ మార్కెట్‌లో విక్రయించుకోవచ్చని దీంతో తమకు కమీషన్ల బెడద లేకుండా అనుకున్న లాభాలు వస్తాయని పేర్కొన్నారు. విపక్షాలు ఈ బిల్లుపై అనవసరంగా రాజకీయం చేస్తున్యాని ఆయన విమర్శించారు.

ఈ రోజు రాజ్యసభలో వ్యవసాయ బిల్లుపై చర్చ, ఓటింగ్ జరుగనుంది. ఎన్డీఏ పక్షాలు, ఆర్ఎస్ఎస్ శ్రేణులు సైతం దీన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పాస్ చేయించుకోవాలని అధికార, ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.

కాగా ఈ బిల్లుతో భారత ఆహార సంస్థ (ఎఫ్.సీ.ఐ) మూతపడుతుందని.. కనీస మద్దతు ధర హామీ కుంటుపడుతుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 243. ఇందులో కరోనా కారణంగా 25మంది ఎంపీలు దూరమయ్యారు. దీంతో మేజార్టీ మార్క్ 110కి పడిపోయింది.

బీజేపీకి సొంతంగా 86మంది ఎంపీల బలం ఉంది. ఎన్టీఏ మిత్రులతో కలిపితే బలం 105గా ఉంది. కానీ ముగ్గురు అకాలీదళ్ ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయనున్నారు. కాంగ్రెస్ కు 40, టీఎంసీకి 13, సమాజ్ వాదీకి 8, బీఎస్పీ 4, ఆమ్ ఆద్మీ 3 ఇతర చిన్నపార్టీలు సర్కార్ కు వ్యతిరేకంగా ఓటేయనున్నాయి.

ఈ క్రమంలోనే రాజ్యసభలో బలం లేని బీజేపీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మద్దతుపైనే ఆధారపడింది. ముఖ్యంగా వైసీపీ, టీఆర్ఎస్, బీజేడీ ఎంపీల ఓట్లపై ఆశలు పెట్టుకుంది.

ఏడుగురు ఎంపీలున్న టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటేయనుండగా.. తొమ్మిది మంది ఎంపీలున్న బీజేపీ సైతం అదే బాటలో పయనించనుంది.

ఇక ఆరుగురు ఎంపీలున్న వైసీపీ నిర్ణయం కీలకం కానుంది. లోక్ సభలో కేంద్ర వ్యవసాయ బిల్లుకు మద్దతిచ్చిన వైసీపీ రాజ్యసభలోనూ అదే చేయనుందా లేదా చూడాలి. రైతు వ్యతిరేక బిల్లులపై వైసీపీ మద్దతు ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతోంది.